మొన్న కూలుస్తామన్నోడు.. ఇప్పుడు జగన్ కు పుష్పాభిషేకం చేస్తారట

Update: 2021-12-08 04:33 GMT
సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో విపరీతంగా నానారు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. ఆయన నోటి నుంచి షాకింగ్ వ్యాఖ్యలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం మీదా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

జగన్ ను నమ్మి ప్రభుత్వ ఉద్యోగులంతా ఓట్లు వేశామని.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొంటూ.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు ఏ పార్టీకి తొత్తులు కావని.. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అనూహ్యంగా ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే బండి శ్రీనివాసరావు మాటల్లో మార్పు వచ్చింది.

తాను చేసిన వ్యాఖ్యల్ని కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వానికి.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్న సఖ్యతను చెడగొట్టేందుకే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయన్నారు.

ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాన్నారు. ఉద్యోగ.. ఉపాధ్యాయ.. కార్మిక.. ఔట్ సోర్సింగ్.. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్న ఆయన.. తమకు కష్టం వస్తే ప్రభుత్వం పైనే అలుగుతామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించనందుకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని చెప్పిన ఆయన.. పదో తేదీన భోజన విరామ సమయంలో నిరసన చేపడతామంటూ తమ నిరసన కార్యక్రమాల షెడ్యూల్ ను ప్రకటించారు.

బండి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇలాంటి వేళ.. తాజాగా ఆయన టోన్ మారింది. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన మాట్లడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించటం లేదని తాను నమ్ముతున్నట్లుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ పీఆర్సీ ప్రకటిస్తే.. తమ ఉద్యమాన్ని విరమిస్తామని.. ఆయనకు పాలాభిషేకం.. పుష్పాభిషేకాన్ని చేస్తామన్నారు.

తాము ముఖ్యమంత్రి బిడ్డలమని.. కోపం వస్తే అలగటం సహజమన్న ఆయన.. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. తమ సమస్యల పరిష్కారం మీద ప్రభుత్వం మొండిగా ఉంటుందని తాను భావించటం లేదన్న ఆయన.. ఒకవేళ అదే ఉంటే.. ముఖ్యమంత్రి నోటి నుంచి తిరుపతిలో పీఆర్సీ ఇస్తామని చెప్పరు కదా? అని వ్యాఖ్యానిస్తున్నారు.

మూడు రోజుల క్రితం ఏపీ సర్కారుపై తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేసిన బండి.. అందుకు భిన్నంగా మాట మార్చేసి.. సన్మానాలు.. సత్కారాలకు వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News