నర్సాపురం నాగబాబు : తమ్ముడు చెప్పాడు... అన్న దిగాల్సిందే...?

Update: 2022-10-31 23:30 GMT
మెగా బ్రదర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు నాగబాబు. మెగా బ్రదర్స్ లో మధ్యముడు. అటు అన్నకు అనుంగు తమ్ముడు ఇటు తమ్ముడు మెచ్చిన అన్న. ఇలా కొణిదెల నాగబాబు సినీ రాజకీయ జీవితంలో అన్నదమ్ముల పాత్ర అత్యంత కీలకం. నాగబాబు ఇపుడు జనసేనలో కీలకంగా మారుతున్నారు. పవన్ కళ్యాణ్ వెన్నంటి ఆయన ఉంటున్నారు. అడుగులో అడుగు వేస్తున్నారు. తమ్ముడు సీఎం అయితే చూడాలని అన్న గారి కోరిక. ఇక తమ్ముడు కోసం తానే ఒక వీర సైనికుడుగా ముందుడి అరాచక శక్తులను అడ్డుకుంటానని ఇటీవల మంగళగిరిలో జరీన జనసేన కార్యకర్తల సమావేశంలో నాగబాబు పవర్ ఫుల్ ప్రకటన చేశారు.

నిజానికి నాగబాబుకు రాజకీయాలు అంటే ఎంత ఆసక్తి ఉందో తెలియదు కానీ తమ్ముడు కోసం ఆయన అందులోకి వచ్చేశారు అనే భావించాలి. 2019 ఎన్నికల్లో నాగబాబు నర్సాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి రెండున్నర లక్షల దాకా ఓట్లు సంపాదించారు. నర్సాపురం అంటే రాజుల సీటుగా పేరు. 2014, 2019 ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులే గెలిచారు. ఇక వైసీపీ తరఫున రఘురామక్రిష్ణం రాజు టీడీపీ అభ్యర్ధి మీద గెలిచారు. మూడవ ప్లేస్ లో నాగబాబు ఉన్నారు.

ఇదిలా ఉంటే గత మూడేళ్ళుగా చూసుకుంటే టీడీపీ ఎంపీ సీట్లో పెద్దగా పుంజుకున్నది లేదు అని అంటున్నారు. ఈ పార్లమెంట్ సీటు పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యే సీట్లలో మాత్రం టీడీపీ గట్టిగానే ఉంది. పైగా ఇప్పటికి అనేక సార్లు పొత్తులో ఈ సీటుని బీజేపీకి ఇచ్చిన చరిత్ర కూడా టీడీపీకి ఉంది. రేపటి రోజున ఈ సీటు నుంచి జనసేన పోటీకి దిగుతాను అంటే సంతోషంగా టీడీపీ ఓకే చెబుతుంది.

దాంతో ఈసారి కూడా మెగా బ్రదర్ ని పోటీకి నిలపాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మెగా బ్రదర్ నిజానికి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను, పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాను అని ఇప్పటికే మీడియాకు కూడా చెప్పి ఉన్నారు. పైగా ఆయన ఓడాక ఆ వైపు కూడా చూడడంలేదు. అయితే తమ్ముడు చెప్పాడు కాబట్టి అన్న నాగబాబు కార్యక్షేతంలోకి దిగాల్సిందే అంటున్నారు. ఇంకా ఏణ్ణర్ధం సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే పికప్ చేసుకుంటే నాగబాబు గెలిచే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ సీటు విషయంలో అన్యాపదేశంగా నాగబాబు పేరు చెప్పరని అంటున్నారు. అదేలా అంటే పీఏసీ స‌మావేశంలో ప‌శ్చిమ గోదావ‌రి విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందట. తమకు వైసీపీ నానా ఇబ్బందులు పెడుతోందని,కనీసం బ్యానర్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదని జనసైనికులు వాపోయారుట. దానికి  జవాబుగా ఇంక అంతా నాగబాబు వచ్చి చూసుకుంటారు అని పవన్ చెప్పడంతో ఈ సీటు మీద క్లారిటీ వచ్చేసినట్లే అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఓడిన చోటనే గెలవాలి అన్నదైతే పవన్ లో కనిపిస్తోంది. అదే టైం లో తన అన్నను ఢిల్లీ రాజకీయాలకు పంపి తాను స్టేట్ పాలిటిక్స్ చూసుకోవాలన్న ఆలోచనలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే నర్సాపురం గెలుపు అంత ఈజీ కాదు అని అంటున్నారు. ఓట్లు కాపులవి అయినా ఆధిపత్యం అంతా రాజుల తోనే అని చెబుతున్నారు. వారితో సరిగ్గా డీల్ చేస్తూ వ్యవహారం చక్కబెడితే గెలుపు గ్యారంటీ అని అంటున్నారు. సో నర్సాపురం నాగబాబు అవుతున్నారన్న మాట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News