బీజేపీలో ఈటలకు ఉక్కపోత.. అసలేం జరుగుతోంది?

Update: 2023-01-29 08:00 GMT
బీఆర్ఎస్ నుంచి బలవంతంగా గెంటివేయబడి బీజేపీలో చేరి కేసీఆర్ కే సవాల్ చేసిన ఈటల రాజేందర్ కమలం పార్టీలోనూ ఉక్కపోత మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా ఆయన మాటలు విన్నాక అందరికీ అదే అర్థమైంది. బీజేపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని తెలుస్తోంది. బీజేపీలో చక్రం తిప్పుతారని భావించిన ఈటల రాజేందర్ కు ఇప్పుడు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిగా ప్రచారమైన ఈటల రాజేందర్ విషయంలో ఏం జరుగుతోందన్ని అంతుబట్టడం లేదు.

ఈటల రాజేందర్ పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారం వెనుక కారణాలు ఏమిటీ? వంటి అంశాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ ను ఎదురించి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలను బీజేపీ కూడా మొదట్లో  బాగానే ఆదరించింది. ఏకంగా చేరికల కమిటీ చైర్మన్ గా నియమించి బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి నేతలను లాగేసే పనిని అప్పగించింది. కానీ ఆయన దూకుడుకు బీజేపీలోని కోవర్టులే అడ్డుతగిలారని..ముందే లీక్ చేశారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.

ఈటల రాజేందర్ తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొని నిలిచారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ముఖ్యంగా పార్టీలోని అసంతృప్తులను బీజేపీ బాట పట్టించడంలో బాగానే కష్టపడుతున్నారు. అయితే ఈటలకు బీజేపీలో క్రేజ్ చూసి కొందరికి మింగుడు పడడం లేదని.. అందుకే కేసీఆర్ కు సీక్రెట్స్ అన్నీ చేరవేస్తున్నారని ఈటల ఇటీవల అసహనం వెళ్లగక్కారు.

బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారని ఈటల ఆవేదన వైరల్ అయ్యింది. కేసీఆర్ ప్రతి పార్టీలో కోవర్టులను నియమించారని బీజేపీలోనూ ఉన్నారని ఆరోపణలు చేశారు. అందుకే తమ పార్టీలో ఎవరూ చేరడం లేదన్నట్లు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాను తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోతున్నామని మథనపడుతున్నట్లు సమాచారం.బీజేపీలో ఎవరు కోవర్టులు ఉన్నారో తెలియక అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈటల కామెంట్స్ తో కొందరు డిఫెన్స్ లో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే నాయకులు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పుడున్న బీజేపీకి ప్రజా బలం ఉన్నా.. నాయకుల బలం తక్కువే అని చెప్పవచ్చు. ఇతర పార్టీల నుంచి గెలుపు గుర్రాలను చేర్చుకోకపోతే ప్రజలు ఆదరించే అవకాశం లేదు. అందువల్ల ఈటలకు  పెద్ద బాధ్యతను అప్పగించారు.

అయితే ఈ వ్యాఖ్యల తర్వాత ఈటల పార్టీ మారుతారని కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం మొదలైంది. అయితే తాజాగా తాను బీజేపీని వదిలేది లేదని ఈటల తేల్చిచెబుతున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారని.. తనపైకాంగ్రెస్ నేతలు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను పార్టీ మారనని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News