వైసీపీకి ఆముదం రాసేస్తున్నారు...టీడీపీ కూన కులాసా...

Update: 2022-11-22 02:30 GMT
శ్రీకాకుళం జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఆముదాలవలస ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి సీటు. ఆ పార్టీ పెట్టాక జరిగిన అనేక ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచి సత్తా చాటింది. మధ్యలో కాంగ్రెస్ వైసీపీ మెరుపులు మెరిపించినా ఆముదాలవల అంటే పసుపు పార్టీదే అన్న మాట ఉంది. ఇక్కడ నుంచి అయిదు సార్లు వరసబెట్టి తమ్మినేని సీతారాం గెలిచారు. టీడీపీలో మంత్రిగా కూడా ఆయన కీలకమైన  బాధ్యతలు నిర్వహించారు.

అయితే ఆయన  ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి పోటీ చేసి పరాజయం పాలు అయ్యారు. ఆయన పార్టీ మారినా మేనల్లుడు కూన రవికుమార్ మాత్రం టీడీపీని అట్టిబెట్టుకుని ఉన్నారు. కూన పక్కన ఉండగా తమ్మినేనికి ఎదురులేదు. అయితే ఆయన సైకిల్ దిగకపోవడంతో సీతారాం సీన్ సితార్ అయింది. అలా రెండు దశాబ్దాల పాటు ఆయన గెలుపు పిలుపు వినలేకపోయారు.

ఎట్టకేలకు జగన్ వేవ్ లో ఏడు పదుల వయసులో ఆయన 2019 ఎన్నికల్లో ఆముదాలవలసలో గెలిచారు. నాడు వైసీపీలోని ఇతర నాయకులు అంతా ఆయనకు సహకరించారు. కానీ మూడేళ్ళు తిరిగేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. తమ్మినేని తన రాజకీయ వారసుడిగా కుమారుడు చిరంజీవి నాగ్ కోసం తమను తొక్కేస్తున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. దాంతో ఎవరికి వారే వేరు కుంపట్లు పెట్టారు.

వారంతా ఇపుడు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. తమ్మినేనికి టికెట్ ఇవ్వవద్దు అంటూ తమకు కోరుకుంటున్నారు. వీరంతా మండల స్థాయి నాయకులు కావడం విశేషం. అలాంటి వారిలో సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్, మాజీ మునిసిపల్ చైర్మన్ బొడ్డేపల్లి రమేష్, కోట గోవిందరావు వంటి వారు ఉన్నారు. వీరంతా ఒక్కటిగా కలసికట్టుగా పనిచేయడం వల్ల టీడీపీని ఓడించి మరీ 17 వేల ఓట్లకు పైగా మెజారిటీతో తమ్మినేని సీతారాం గెలిచారు.

అయితే ఆ తరువాత ఆయన తమను పట్టించుకోవడంలేదని వీరంతా మండిపడుతున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో ఎంపీపీ పదవి కోసం  సువ్వారి గాంధీ భార్య  సువ్వారి దివ్య కోసం  కోరినా ఎక్కడ తనకు ఆయన ఎమ్మెల్యే టికెట్ కి పోటీ అవుతారో అని స్పీకర్ వర్గీయులు పక్కన పెట్టేశారు అని అంటున్నారు. అలాగే మరో నేత ఆమదాలవలస మండలానికి చెందిన కోట గోవిందరావు భార్య కృష్ణకుమారి కలివరం ప్రాదేశికం నుంచి పోటీ చేస్తే అక్కడ  ఆమెను ఓడించి టిడిపి తరఫున పోటీ చేసిన స్పీకర్‌ వదిన తమ్మినేని భారతిని గెలిపించారని ఆయన మండిపోతున్నారు.

ఇలా ఒక్కో నేతది ఒక్కో కారణం. దాంతో వీరంతా ఆముదాలవలలో ఎవరి దుకాణం వారు పెట్టేసుకునారు. అందరూ వైసీపీ నేతలే. అందరూ జై జగన్ అంటూ సొంత ఆఫీసులు ఏర్పాటు చేసుకుని ఎవరి మటుకు వారు ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. చింతాడ రవికుమార్‌ జగనన్న ప్రజాసేవ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే,  కోట గోవిందరావు ఏకంగా ఆముదాలవలస మెయిన్ రోడ్డులోనే తన ఆఫీస్ పెట్టేసుకున్నారు. వీరంతా కూడా ఒక వైపు తమ్మినేనిని వ్యతిరేకిస్తూ మరో వైపు టికెట్ తమదే అని చెప్పుకుంటున్నారు.

ఇక తమ్మినేని సీతారాం అయితే తన కుమారుడు చిరంజీవి నాగ్ కి టికెట్ అడుగుతున్నారు. కానీ ఇప్పటికే టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. పైగా తమ్మినేని ఫ్యామిలీకి టికెట్ ఇస్తే సహకరిచమని ఇతర నేతలు చెబుతున్నారు. దాంతో వైసీపీకి ఇక్కడ పెద్ద చిక్కు వచ్చిపడింది అంటున్నారు. వీరంతా కలసినా టీడీపీ  శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్, ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ని ఓడించడం కష్టమే అంటున్నారు. అలాంటిది వర్గాలుగా విడిపోయిన వీరు కూన ఫుల్ హ్యాపీస్ అయ్యేలా చేస్తున్నారు అని అంటున్నారు. మరి టోటల్ 175కి 175 అంటున్న వైసీపీ అధినాయకత్వం ఆముదాలవలసను అందులో ఉంచిందా లేదా అన్న డౌట్ వస్తోందిట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News