వైసీపీ రాజ్యంలో కడప రెడ్లు...ఆ నలుగురితోనే అంతానా...?

Update: 2022-11-28 15:18 GMT
అపుడెపుడో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మూవీ ఒకటి అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ వచ్చింది. దాని ఫలితం జనాల రియాక్షన్ ఎలా ఉన్నా కూడా సరిగ్గా మూడున్నరేళ్ళ పాలన ముగిసేసరికి ఏపీ వైసీపీ రాజ్యంలో కడప రెడ్ల హవా గట్టిగానే కనిపిస్తోంది అని అంటున్నారు. ప్రభుత్వ రధానికి  కీలకమైన  నాలుగు చక్రాలూ కడప జిల్లా నుంచే ఉండడం అరుదైన విశేషంగా చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వానికి సారధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. ఆయన అచ్చమైన కడప బిడ్డ. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వాన్ని అధికారిక వ్యవస్థ నుంచి నడిపించే బాస్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత కీలక భూమిక పోషిస్తారు. అలా ఏపీకి కొత్త   సీఎస్ గా జవహర్  రెడ్డిని నియమించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకే జగన్ ఆమోదముద్ర వేశారని కూడా ప్రచారం సాగుతోంది.

నూతన సీఎస్ అయిన జవహర్ రెడ్డి కడప జిల్లా కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందినవారు. ఇక   ఏపీకి  పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి సైతం కడప జిల్లాకు చెందిన వారే. ఆయన పొద్దుటూరు నియోజకవర్గం నుంచి వచ్చిన వారు. నాలుగవ రధ చక్రం, జగన్ కి అన్నీ అయిన సకల శాఖల మంత్రిగా పేరు పొందిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కడప జిల్లా పులివెందులకు చెందిన వారు.

ఈ విధంగా కనుక చూసుకుంటే కడప జిల్లాకు చెందిన నలుగురు రెడ్లు ఏపీ రాజ్యాన్ని నడిపించే మూల కేంద్రాలు అని అంటున్నారు. ఇక జవహర్ రెడ్డి నియామకం మీద కూడా చర్చ సాగుతోంది. ఆయన్ని ఏరి కోరి తెచ్చుకున్నారని అంటున్నారు. ఆయన కంటే ముగ్గురు అధికారులు ఆ పదవి కోసం సీనియర్లుగా ఉన్నా వారి సీనియార్టీని పక్కన పెట్టి మరీ జవహర్ రెడ్డినే కోరుకున్నారు.
Read more!

కొత్త సీఎస్ జవహర్ రెడ్డి ఏడాదిన్నరకు పైగా ఈ కీలకమైన పదవిలో ఉంటారు. అంటే ఎన్నికల వేళకు ఆయనే సీఎస్ అన్న మాట. ఈ విధంగా అత్యంత కీలకమైన పదవులలో కడప జిల్లా నుంచి నలుగురు ఉన్నారని అంటున్నారు. వారితోనే మొత్తం ఏపీ సర్కార్ వారి బండి జోరు చేస్తోందని విపక్షాలు ఎవరైనా సెటరికల్ గా అన్నా తప్పు లేదు. కాకపోతే ఈ విధంగా చేయడం రాజ్యాంగ బద్ధమే కాబట్టి అందులో పొరపాటు అయితే లేదు.

కానీ అదే సమయంలో ఒకే జిల్లా ఒకే ప్రాంతం ఒకే సామాజికవర్గానికి చెందిన నలుగురు ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవుల్లో ఒకే సందర్భంలో ఉండవచ్చా. ఉంటే అది ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది అని చెప్పడానికి విశ్లేషించడానికి బోలెడు మంది మేధావులు ఎపుడూ తయారుగా ఉంటారు. సో ఆ విషయం కూడా పక్కన పెట్టి జస్ట్ క్యాజువల్ గా దీనిని తీసుకుని కనుక ఆలోచిస్తే వైసీపీ రాజ్యంలో కడప రెడ్లు అని ఆర్జీవీ టైటిల్ ని కాస్త మార్చి సరదాగా చదువుకోవచ్చేమే. అంతే. అంతకంటే ఏమీలేదు కూడా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News