బీజేపీ యోగ నిద్ర... వైసీపీకి భలే చాన్స్... మోడీ సాక్షిగా...

Update: 2022-11-05 02:30 GMT
తమ పార్టీకి చెందిన ప్రధాని తమ ప్రాంతానికి వస్తూంటే ఆ రాజకీయ పార్టీలో ఎంత జోష్ ఉండాలి. ఎలా హడావుడి చేయాలి. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం యోగ నిద్రలో మునిగి  ఉన్నారు. వారు కళ్ళు తెరచి చూడడం అంటే ఆలోచించాల్సిందే. మరి వైసీపీ ఊరుకుంటుందా అందుకే విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల టూర్ ని మొత్తం హైజాక్ చేసేది చక్రం తిప్పేస్తోంది. నిజానికి మోడీది పూర్తిగా అధికారిక కార్యక్రమం.

ఆయన ఏపీకి వస్తున్నారు కాబట్టి వైసీపీ సర్కార్ ఆయన టూర్ మొత్తం చూసుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారం   సీఎం, మంత్రులు ప్రధాని సభలో పాలుపంచుకోవచ్చు. అంతవరకే వైసీపీ బాధ్యత. కానీ ఈ నెల 11, 12 తేదీలలో విశాఖలో మోడీ టూర్ ఖరారు కావడమేంటి ఎక్కడో ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అలా వచ్చి విశాఖలో వాలిపోయారు.  ఆయన స్వయంగా ప్రధాని ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు.

జిల్లా అధికారులతో కలసి ఆయన ఏయూ గ్రౌండ్స్ కి వెళ్లి ప్రధాని సభ ఏర్పాట్లను చూశారు. అధికారులకు సూచనలు చేశారు. లక్ష మందికి తగ్గకుండా జనాలకు ప్రధాని సభకు సమీకరించాలని వైసీపీ డిసైడ్ చేసుకుంది. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వారిదే ఇపుడు ప్రధాని సభ కోసం హడావుడి. మరి విశాఖలో బీజేపీ నేతలు ఉన్నారు.

ఏపీలో కూడా బీజేపీ ఉంది. కానీ ముందే చెప్పినట్లుగా యోగ నిద్రలో ఉన్న వారు కాస్తా కాదు చాలా ఆలస్యంగా కళ్ళు తెరచారు. చూస్తూండగానే వైసీపీ చేతులలోకి మోడీ టోటల్ టూర్ ప్రోగ్రాం వెళ్ళిపోయింది. దాంతో బీజేపీ పెద్దగా సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని సభ  ఏర్పాట్లు చూడడానికి విజయసాయిరెడ్డికి ఏమిటి పని అని  ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కార్యక్రమం జరగాలి తప్ప పార్టీ నేతల సారధ్యంలో కాదని సోము ఫైర్ అయ్యారు.

ఇపుడు విశాఖ బీజేపీ నేతల వంతు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అయితే వైసీపీ వారు ప్రధాని టూర్ ని హైజాక్ చేస్తున్నారు అని మండిపడ్డారు. గతంలో ఇలగే భీమవరంలో ప్రధాని కార్యక్రమాన్ని తమ సొంత పార్టీ కార్యక్రమంగా చేసి ఖరాబు చేశారు. ఇపుడు ఇదే పని చేస్తున్నారు అని విమర్శలు గుప్పించారు. ప్రధాని సభ అంటే అధికారిక కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం పాలు పంచుకోవచ్చు. అంతే తప్ప వైసీపీ వారి సొంత ప్రోగ్రాం కాదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే వైసీపీ వారు ఇలా చేయడానికి కారణం ఎవరు అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. ఇదంతా బీజేపీ చేతగానితనం వల్లనే వచ్చిందని అంటున్న వారూ ఉన్నారు. ప్రధాని వంటి నాయకుడు వస్తే ముందే మేలుకుని తాము చేయాల్సిన పనులు చేస్తే వైసీపీ దూరంగానే ఉండేది కదా అంటున్నారు. పైగా పదివేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని విశాఖలో ప్రారంభిస్తూంటే రాజకీయంగా ఆ మైలేజ్ ని దక్కించుకునేది కదా అని కూడా అంటున్నారు.

కాని ఏం లాభం. ఇపుడు మరోసారి వైసీపీ చేతుల్లోకే ఈ కార్యక్రమం వెళ్తోంది. పొలిటికల్ మైలేజిని వైసీపీ తన ఖాతాలో వేసుకోవడానికి జోరు చేస్తోంది. ఇంత లేట్ గా కళ్ళు తెరచి వైసీపీ మీద గదమాయిస్తే ఫలితం ఏంటి కమలనాధులూ అని అంతా అంటున్నారు.

ఈ ఒక్క విషయమే కాదు ఏపీలో వైసీపీ మీద గట్టిగా పోరాటాలు చేయడానికి కూడా బీజేపీ పెద్దలకు తీరిక లేకుండా పోతోందని, మిత్ర పక్షం జనసేనను కలుపుకుని పోకుండా తాత్సారం చేస్తూ కాలం గడిపేస్తోందని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ నేతల తీరు మీద విమర్శలు తప్ప ఎవరూ సానుభూతి చూపించే సీన్ లేదనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News