పోటీ పరీక్షల్లో భర్త బిజీ.. విడాకులు కోరిన భార్య

Update: 2019-08-31 11:17 GMT
మాయదారి కాలం వచ్చేసింది. ఎప్పుడేం అవుతుందో అర్థం కాని పరిస్థితి. రక్తం పంచుకు పుట్టిన వారి మధ్యన బంధాలు బలహీనమవుతున్న.. కొత్త బంధాల విషయంలో ఎవరెంత కమిట్ మెంట్ తో ఉంటారో నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. తాజాగా ఉదంతం చూస్తే.. ముక్కున వేలేసుకోవటమే కాదు.. ఇంత చిన్న విషయానికి సైతం విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం కలుగక మానదు.

ఇంతకీ విషయం ఏమంటే.. మధ్యప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తికి కొద్దికాలం క్రితమే పెళ్లైంది. అతడు సివిల్స్ ను టార్గెట్ చేసి.. ఆ పరీక్షలకు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు. భార్యను పట్టించుకోవటం మానేశాడు. దీంతో.. భర్త తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళ.. తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరింది. దీంతో భర్తకు నోటీసులు ఇచ్చారు.

ఇరువురికి కోర్టు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా సదరు యువతి మాట్లాడుతూ.. తన భర్త పీహెచ్ డీ పూర్తి చేశాడని.. ఇంట్లో వారి ఆరోగ్యం బాగోలేని నేపథ్యంలో.. వారి బలవంతంతో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత భార్య ఉందన్న విషయాన్ని అతడు పూర్తిగా మర్చిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కలిసి ఉండటం కుదరదు. విడాకులు ఇప్పించాల్సిందే అని కోరింది.

అయితే.. భర్త వాదన మరోలా ఉంది. తన భార్య పుట్టింటికి వెళ్లిందని.. తిరిగి రావటానికి ఇష్టపడటం లేదని చెబుతున్నాడు. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఇలాంటప్పుడు అతనితో కలిసి ఉండటం సాధ్యం కాదని.. తనకూ విడాకులు ఇప్పించాల్సిందిగా కోరాడు. ఇరువురికి సర్ది చెప్పేందుకు ఇరు కుటుంబాల వారు ఎంత ప్రయత్నించినా వారు మాత్రం తమ పట్టు వీడటం లేదట. దీంతో జోక్యం చేసుకున్న కోర్టు.. మరో నాలుగు కౌన్సిలింగ్ లు నిర్వహిస్తామని.. అప్పటికి తీరు మార్చుకోకుంటే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. భర్త నిర్ణీత లక్ష్యం కోసం చదువులో నిమగ్నమైతే.. సహకరించకుండా ఇలా విడాకులు కోరుతారా? అంటూ క్వశ్చన్ చేస్తుంటే.. మరికొందరు సదరు మహిళ వాదన సరైనదంటూ మద్దతుగా నిలవటం గమనార్హం.
Tags:    

Similar News