కొత్త దందా, 'పేదల' పేరుతో రూ.కోటి దోచుకున్నారు

Update: 2020-07-31 03:30 GMT
పేదల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకొని ఘరానా మోసానికి పాల్పడిన ఓ ఎన్జీవో సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయలు దండుకున్నారు. హుమాయున్‌నగర్‌కు చెందిన ఇద్దరు  వ్యక్తులు మార్చిలో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. పేదల దయనీయ గాథలను వీడియోలుగా రూపొందించి ఆదుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఈ వీడియోలు చూసిన చాలామంది పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. అయితే దాతలు ఇచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తం వీరిద్దరు తీసుకొని, చాలా తక్కువ మొత్తాన్ని బాధితులకు ఇచ్చేవారు.

వారు ఇలా కోటి రూపాయల వరకు కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. యాభై ఏళ్ల ఓ మహిళ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, ఆమె నలుగురు కూతుళ్లను ఆదుకోవాలని పది రోజుల క్రితం వీడియో చేశారు. బాధితురాలి బంధువు బ్యాంకు అకౌంట్, గూగుల్ పే నెంబర్లు ఇచ్చారు. దాతల నుండి రూ.45 లక్షల వరకు వచ్చాయి.

ఆ తర్వాత మూడు రోజులకు బాధితురాలు మృతి చెందారు. ఈ రూ.45 లక్షల్లో వీరిద్దరు చెరో రూ.15 లక్షలు తీసుకున్నారు. కొంతమంది దాతలు తాము ఇచ్చిన డబ్బులు బాధితులకు చేరాయో లేదో తెలుసుకునే ప్రయత్నంలో.. వీరు చీట్ చేస్తున్న విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీరిపై చాంద్రాయణగుట్ట, పంజాగుట్ట, అఫ్జల్ గంజ్, నాంపల్లి, హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో వీరు కోటి రూపాయల వరకు ఇలా దోచుకున్నట్లు గుర్తించారు.
Tags:    

Similar News