సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు నమోదు

భావ ప్రకటన స్వేచ్ఛ.. ఈ మధ్య సినీ ప్రముఖులకు ఎక్కువైపోయిందన్న చర్చ సాగుతోంది.;

Update: 2025-12-29 12:56 GMT

భావ ప్రకటన స్వేచ్ఛ.. ఈ మధ్య సినీ ప్రముఖులకు ఎక్కువైపోయిందన్న చర్చ సాగుతోంది. నటుడు శివాజీ అమ్మాయిలపై వ్యాఖ్యల మంటలు ఇంకా చల్లారనే లేదు.. ఇప్పుడు నటి మాధవీలత ఏకంగా దేవుడి గురించి మాట్లాడిన మాటలు మరో పెను వివాదానికి దారితీశాయి. ఏది పడితే అది మాట్లాడితే.. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న కనీస అవగాహన సెలబ్రెటీలు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కేసులు, కోర్టుల వరకూ ఈ వ్యవహారాలు వెళ్లక తప్పదు.

ప్రముఖ సినీ నటి మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలకు కేసు నమోదైంది. షిరిడీ సాయిబాబాను ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయన్న ఆరోపణలతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సాయిబాబా దేవుడు కాదంటూ మాధవీలత ఇటీవల కొన్ని పోస్టులు పెట్టారు. అవి భక్తుల విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకున్న పోలీసులు.. కేవలం మాధవీలతపైనే కాకుండా ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా ఇంటర్వ్యూలు నిర్వహించి వీడియోలను వైరల్ చేసిన పలువురు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని మాధవీలతతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలపై పోలీసులు సాంకేతిక విశ్లేషణ చేపట్టారు.

పోలీసులు ఈ సందర్భంగా కీలక హెచ్చరిక కూడా చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడటం చట్టరీత్యా నేరమవుతుందని.. ముఖ్యంగా మతపరమైన నమ్మకాలు అత్యంత సున్నితమైన అంశమని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి నమ్మకం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు.. కానీ ఇతరుల విశ్వాసాలను బహిరంగంగా అవమానించడం భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలపై ఐటీ చట్టాల కింద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. సినిమా రంగం లేదా సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది అనుసరించే వ్యక్తుల వ్యాఖ్యలు శాంతిభద్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో మాధవీలత వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలుగా ఉన్నప్పటికీ అవి ఒక వర్గం ప్రజల మనోభావాలను గాయపరిచాయని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు.. వ్యూస్, పాపులారిటీ కోసం వివాదాలను రెచ్చగొట్టే యూట్యూబ్ ఛానెళ్లపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి చర్యలకు ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. విచారణలో మాధవీలత ఇచ్చే వివరణ, ఇతరుల పాత్ర ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రేపు జరిగే విచారణపై ఇప్పుడు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News