బీజేపీ వర్సెస్ కాంగ్రెస్...ముల్లుని ముల్లుతోనే !
బీజేపీ కేంద్రంలో మూడు సార్లు అధికారంలో ఉంది. నానాటికీ ఇంకా పటిష్టం అవుతోంది.;
బీజేపీ కేంద్రంలో మూడు సార్లు అధికారంలో ఉంది. నానాటికీ ఇంకా పటిష్టం అవుతోంది. 2029 లో మరోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దనైకి కారణం ఇంటా బయటా మారిన వాతావరణం. అది బీజేపీకి ఒక బలమైన భావజాలానికి అనుకూలంగా ఉంది. 2014 నుంచి ఈ రోజుదాకా హిందూత్వ భావజాలం దేశంలో పెరుగుతూ వస్తోంది. సహజంగానే బీజేపీ అయితే ఈ నినాదాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తుంది. కానీ అనుకోని వరంలా బయట వాతావరణం కూడా బీజేపీకి కలిసి వస్తోంది. దాంతో ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండాలని సగటు భారతీయుడు కోరుకునే నేపథ్యం ఉంది.
చుట్టూ పక్కల చూడకుండా :
ఇక కాంగ్రెస్ తీరు అయితే ఏ మాత్రం మారలేదు రొటీన్ రొడ్డకొట్టుడు పాలిటిక్స్ చేస్తూ ముందుకు పోతోంది. మోడీ మీద వ్యతిరేకత వస్తే అది తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది. ఒక వైపు దేశంలో ప్రజల ఆలోచనలను కాంగ్రెస్ సరిగ్గా అర్థం చేసుకుందో లేదో తెలియదు, మరో వైపు చూస్తే దేశం బయట ఏమి జరుగుతున్నదో కూడా గమనంలోకి తీసుకుని దానికి అనుగుణంగా తమ యాక్షన్ ప్లాన్ మార్చుకోవాలన్న ఆలోచన కూడా కనిపించడం లేదు. పైగా తప్పుల మీద తప్పులు చేస్తూ పోతోంది. ఎర్లీ సిక్స్ టీస్, సెవెంటీస్ నాటి పాలిటిక్స్ ని చేస్తూ పోతోంది. మాట్లాడితే చాలు ఆర్ఎస్ఎస్ మీద విరుచుకుపడుతోంది. ఫలితంగా వామపక్షాల కన్నా ఎక్కువ ప్రాంతీయ పార్టీల పక్కన కాంగ్రెస్ గ్రాఫ్ ఉంటోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
హిందూత్వ అస్త్రం :
ఈ రోజున దేశంలో హిందూత్వ భావజాలం బలంగా ఉంది. ప్రజలకు వాస్తవాలు అర్ధమయ్యాయా లేక ఇంటా బయటా జరుగుతున్న పరిణామాలను బట్టి వారు అలా ఆలోచిస్తున్నారా తెలియదు కానీ హిందూత్వ మీద జనాలు ఎక్కువ మక్కువ కనబరుస్తున్నారు. నిజానికి వాజ్ పేయ్ అద్వానీ సమయంలో ఇంతకంటే ఎక్కువగా హిందూత్వ నినాదాలు వినిపించాయి. అద్వానీ అయితే ఏకంగా సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య దాకా భారీ రథయాత్రకు శ్రీకారం చుట్టారు. అలా ప్రజలలో హిందూత్వ భావాలను మొలకెత్తించడానికి బీజేపీ అప్పట్లో చేసిన ప్రయత్నాలు ఒక స్థాయి వరకే పరిమితం అయ్యాయి. ఇపుడు మోడీ అమిత్ షా ఏలుబడిలో హిందూత్వకు అనుకూలంగా ఎక్కువగా జనాలు మొగ్గు చూపుతున్న నేపథ్యం ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పాల్సి ఉంది.
పొరుగు దేశాల తీరుతో :
పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి భారత్ వ్యతిరేకతతోనే ఉంది. అది కాలానికి తగినట్లుగా తన ధోరణిని ఇంకా పెంచుకుంటూ పోతోంది. పాక్ కి తోడుగా మరిన్ని దేశాలు ఇపుడు తయారు అయ్యాయి బంగ్లాదేశ్ భారత్ కి వ్యతిరేకంగా మారుతుందని ఎవరైనా ఊహించారా. అక్కడ హిందువుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. భారత్ తో స్నేహంగా ఉన్న సౌదీ అరేబియా పాక్ తో చేతులు కలిపింది. చైనా తో పోరు ఉండనే ఉంది. మరో ఏకైక హిందూ దేశం నేపాల్ కూడా భారత్ మీద విరుచుకుపడుతోంది. అమెరికా చూస్తే భారత్ తో ఎపుడూ అవసరార్ధం స్నేహాన్నే చూపిస్తోంది అన్నది ఉంది. కెనడాలో హిందూత్వ వ్యతిరేక భావజాలం కనిపిస్తోంది. ఇక గతంతో పోలిస్తే భారతీయులు ప్రపంచం అంతా తిరిగి వస్తున్నారు ఎక్కడకు వెళ్ళినా ఒక వైపు హిందూత్వ గొప్పతనం తెలుస్తోంది మరో వైపు వివక్ష కూడా కనిపిస్తోంది. దాంతో వీటిని గుర్తించిన మీదటనే భారత్ లో హిందూత్వను కాపాడుకోవాలన్న దృఢ నిశ్చయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది ఇక పాక్ భారత్ మీద చేస్తున్న దాడులను మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూర్ పేరుతో తిప్పికొడుతున్న వైనం కూడా భారతీయుల ఆలోచనలను మారుస్తోంది
కొత్త అజెండాతోనే :
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇంకా బీజేపీ మీద విమర్శలు చేస్తూ ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంస్థల మీద మండి పడడం వల్ల లాభం ఉండదు సరికదా బూమరాంగ్ అవుతుంది అని అంటున్నారు. బీజేపీ మాదిరిగా కాకపోయినా హిందూత్వ మీద సాఫ్ట్ కార్నర్ తో కాంగ్రెస్ ఎంతో కొంత వ్యవహరించినా ఆ పార్టీకి గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఎక్కడో గాజాలో ఒక వర్గం మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడడమే కాదు బంగ్లా దేశ్ లో అఘాయిత్యాల మీద నోరు గట్టిగా విప్పి మాట్లాడాలి. దేశంలో తాము కూడా భారతీయుల మనోభావాలను అనుగుణంగా మసలుకుంటామన్న నమ్మకం కాంగ్రెస్ కలిగించిన నాడు బీజేపీ మీద కాంగ్రెస్ చేసే రాజకీయ యుద్ధానికి ఒక లాజికల్ ఎండ్ దొరుకుందేమో.