కరోనా మృతదేహాలతో కొత్త వ్యాపారం !

Update: 2020-09-23 02:30 GMT
కరోనా దెబ్బకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా సోకిన వారిలో చాలామంది కోలుకుంటున్నప్పటికీ , మరణించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఇక ఇదే అదునుగా కొంతమంది కరోనా మృతదేహాలతో సరికొత్త దందా మొదలుపెట్టారు. కరోనా సోకి మరణించిన వారి మృతదేహాల అంత్యక్రియలకు చుట్టాలు ,పక్కవారు ఎవరు సహాయం చేయడం లేదు. దీనితో కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రూ.వేలల్లో డిమాండ్‌ చేసిన పరిణామాలు చూశాం. తాజాగా అమలాపురం ప్రాంతంలో కొంతమంది మరో అడుగు ముందుకేసి కరోనాతో మృతి చెందిన కుటుంబ సభ్యులతో ఫోన్ల ద్వారా సరికొత్త బేరసారాలకు దిగుతున్న వ్యవహారం   వెలుగుచూసింది.

కరోనాతో ఆస్పత్రుల్లో చనిపోతున్న వారి మృతదేహాలను కుటుంబీకులు, బంధువులు వచ్చి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితులు లేవు. ఈ భయాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని అమలాపురంలో కొందరు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కో మృతదేహానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ డిమాండ్‌ చేస్తున్నారట. అమలాపురం కరోనా మహమ్మారి‌ ఆస్పత్రుల్లో ఎవరైనా మృతి చెందితే చాలు...ఆ సమాచారం కోసం అంత్యక్రియలు చేసేవారు ఆ ఆస్పత్రుల వద్ద కాచుకుని కూర్చుంటున్నారు. సీరియస్‌గా ఉండే కరోనా బాధితుల కుటుంబసభ్యుల ఫోన్‌ నంబర్లు ముందుగానే సేకరించి మరీ ఫోన్లు చేసి బేరసారాలు సాగిస్తున్నారు.  

అంత్యక్రియలు మీరు దగ్గరుండి చూసే అవకాశం లేదు కాబట్టి మృతుని అంత్యక్రియలను వీడియో తీసి ఆ తృప్తిని మీకు అందిస్తాం, అందుకు రూ.10 వేలు ఖర్చవుతుంద’ని బేరసారాలకు దిగుతున్నారు. మృతదేహానికి సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన ప్రక్రియంతా శాస్త్రోక్తంగా శ్మశానంలో పూర్తి చేస్తాం...ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందంటూ లిస్టు రాసి ఇచ్చేస్తున్నారట. అమలాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పట్టణం లోని ఓ కోవిడ్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. మరణించిన పది నిమిషాలకు ఈ తరహా ఫోన్లు మొదలయ్యాయి. మరణించిన వ్యక్తికి ముగ్గురు కుమారులు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ ‌లో ఉంటారు. తండ్రి మరణించాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అమలాపురం రాలేకపోయారు. ఎక్కడో హైదరాబాద్‌ లో ఉన్న ఆయనకు కూడా పదేపదే ఫోన్లు చేసి .. వీడియో తీస్తామంటూ  విసిగించడంతో ఆ బాధితుడు మీడియాకు సమాచారం అందించాడు. ఇక్కడ ఉన్న ఇద్దరు కుమారులకు కూడా సెంటి మెంట్‌ మాటలతో వీడియో...శాస్త్రోక్త పక్రియలంటూ ఫోన్లు చేసి ప్యాకేజీలంటూ వెంటపడ్డారు.  ఇలాంటి అనుభవాలు గత రెండు వారాలుగా అమలాపురంలో మొదలయ్యాయని పలు బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంత్యక్రియల కు రూ.వేలు గుంజుతున్న వైనంపై ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌ రాజు దృష్టి పెట్టారు.
Tags:    

Similar News