ఢీలా పడ్డా తేజస్వి యాదవ్... కొంపముంచింది కాంగ్రెస్సేనా ?

Update: 2020-11-11 12:10 GMT
బీహార్ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయాన్ని సాధించింది. హోరాహోరిగా సాగిన పోరులో మేజిక్ ఫిగర్ 122 కంటే ఎక్కువ స్థానాలో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకుంది.ఈ ఎన్నికల్లో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రయత్నాలు ఫలించలేదు. 75 స్థానాలు సాధించిన ఆర్జేడీ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. మిత్రపక్షం కాంగ్రెస్ అంచనాలకు అనుగుణంగా రాణించకపోవడంతో మహాకూటమి అధికార పీఠానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకే పరిమితం అయింది. దీనితో అతి తక్కువ వయస్సులోనే  బిహార్‌ పీఠం ఎక్కాలన్న ఆర్‌జేడీ యువ నేత తేజస్వి యాదవ్‌ కల కలగానే మిగిలిపోయింది.

ఓ వైపు తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైల్లో ఉన్నప్పటికీ, కీలకమైన నేతలందరూ పార్టీని వీడినప్పటికీ  , మోడీ నితీష్ వంటి రాజకీయ ఉద్దండులు ప్రత్యర్థులుగా ఉన్నా తేజస్వి యాదవ్‌ ఈ సారి ఎన్నికల్లో ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. 31 ఏళ్ల వయసున్న తేజస్వి పార్టీ బరువు బాధ్యతల్ని తన భుజం మీద వేసుకొని ఒంటరి పోరాటం చేసి , అగ్రపథం లో నిలిచినా మిత్రపక్షాలు అంతగా ప్రభావం చూపకపోవడంతో అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో తూటాల్లాంటి మాటలతో తేజస్వి చేసిన ప్రసంగాలు, నిరుద్యోగం, వలసవాదుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి విధానపరమైన అంశాలనే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్లడంతో అధికార ఎన్డీయేకి ఎదురు దెబ్బ తగులుతుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్  కూడా తేజస్వికి మద్దతుగా వచ్చినా ఓటమి తప్పలేదు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించడం ఆర్జేడీ విజయావకాశాలను దెబ్బ తీసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్‌జేడీకి మద్దతుగా ఉన్న ముస్లిం, యాదవుల ఓటు బ్యాంకులో ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐఎం చీల్చడం ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు.

ఇక, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ 115 స్థానాలు, బీజేపీ 110 స్థానాలు, వికాస్‌ శీల్ ఇన్సాన్ పార్టీ 11 స్థానాలు, హిందుస్థానీ అవామ్ మోర్చా-సెక్యూలర్ 7 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహాకూటమి నుంచి ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, వామపక్షాలు 29 స్థానాల్లో బరిలో నిలిచాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కనీసం 20 స్థానాల్లో గెలవకపోవడం కూటమి కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 20 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల కంటే తక్కువ సీట్లను సాధించి కూటమి విజయావకాశాలను దెబ్బ తీసిందని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News