ఆధార్ కార్డుకి కొత్త డిజైన్...ఇక అంతా సీక్రెట్
ఆధార్ కార్డు పుష్కర కాలంగా భారతీయ సమాజంలో అతి ముఖ్యమైన ఆధారం అయిపోయింది.;
ఆధార్ కార్డు పుష్కర కాలంగా భారతీయ సమాజంలో అతి ముఖ్యమైన ఆధారం అయిపోయింది. మనిషి ఎదురుగా ఉన్నా ఆధార్ కార్డు లేకపోతే లేనట్లే. అంటే అంతలా రుజువు పత్రంగా మారిపోయింది. ఏ పని కావాలన్నా ఏ లావాదేవీ చేయాలన్నా ఆధార్ కార్డు ఆధారంగా ఉంది. ఆధార్ కార్డుని దేశంలో ఒక విశిష్ట నంబర్ ని వేసి మరీ మొత్తం 140 కోట్ల మంది ప్రజలకు అందించారు ఇది అతి పెద్ద కసరత్తు. ఒక బృహత్తరమైన కార్యక్రమం. అయితే ఇంత పెద్ద కార్యక్రమం దేశంలో సూపర్ హిట్ అయింది. ఈ రోజున నిరక్షరాస్యులకు సైతం ఆధార్ కార్డు ప్రయోజనం తెలిసింది. దాని పనితనం తెలిసి తెలివిగా ఉపయోగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే దేశ పౌరులకు ఇది ఒక ఆధారంగా కాదు ఆలంబనగా మారింది.
సున్నితమైన సమాచారం :
ఆధార్ కార్డు అవసరం లేని చోటు లేదు. దాంతో ఫోటో కాపీలుగా బ్యాంకుల నుంచి సిమ్ కార్డులను తీసుకునే వరకూ అందరికీ ఇస్తున్నారు. ఇందులో మొత్తం మ్యాటర్ ఉంటోంది. 12 నంబర్ల ఆధార్ విశిష్ట సంఖ్య, అలాగే పూర్తి పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇలాంటి అత్యంత సున్నితమైన సమాచారం మొత్తం జిరాక్స్ కాపీ రూపంలో బయట ఎందరి చేతులో మారుతోంది. వీటిని నేరగాళ్ళు సులువుగా తన నేరాలకు వాడుకుంటున్నారు. అందుకే పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.
దుర్వినియోగం సైతం :
అయితే ఆధార కార్డు విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. ఆధార్ కార్డు నంబర్ చెప్పినా ఫోన్ లో ఓటీపీ నంబర్ సరి చూసుకుని అంతా లావాదేవీలు జరిపేందుకు చర్యలు తీసుకున్నా మోసగాళ్ళ బారిన ఇంకా పడుతూనే ఉంది. జరగాల్సిన మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆధార్ పేరుతో జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా ఫోటో కాపీలను తీస్తున్నారు. అలా ఆధార్ కార్డుని చేతులు మార్చేసుకుని నేరాలకు పాల్పడుతున్న వారు ఆర్ధిక మోసాలు చేస్తున్న వారు పెద్ద ఎత్తున ఉన్నారు. అంతే కాదు వ్యక్తిగత సమాచారం అందులో ఉండడం వల్ల దుర్వినియోగం చేస్తున్నారు.
చెక్ పెట్టేలా యూఐడీఏఐ చర్యలు :
దీంతో రంగంలోకి దిగిన యూఐడీఏఐ ఆధార్ మోసాలకు చెక్ పెట్టేలా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసింది. ఆధార్ ని దుర్వినియోగం చేయకుండా చూడడం కోసమే యూఐడీఏఐ పకడ్బంధీ చర్యలను చేపడుతోంది అని అంటున్నారు ఈ క్రమలో భారీ మార్పులకే అధార్ లో శ్రీకారం చుడుతున్నారు. కొత్తగా చేసే ఆధార్ కార్డు డిజీన్ లో కేవలం మనిషి ఫోటో మాత్రమే ఉంటుంది. ఆ పక్కన క్యూఆర్ కోడ్ ని ముద్రిస్తారు. అంతకు మించి ఏదీ ఆధార్ కార్డు మీద కనిపించేదే ఉండదు. ఇక ఆధార్ కార్డుని ఎవరైనా దృవీకరించాలి అంటే క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేస్తే అందులోనే అన్ని వివరాలూ వస్తాయి. అంతే కాదు కేవైసీ ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ప్రతీ మనిషి వ్యక్తిగత భద్రత విషయంలో గోప్యత పాటించేందుకు వీలు ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నామని యూఐడీఏఐ సీఈవో భువనేశ్ కుమార్ ఇటీవల నిర్వహించిన ఒక సమావేశంలో స్పష్టం చేశారు. రానున్న రోజులలో అధార్ కార్డు కొత్త రూపులో షేపులో వస్తే కనుక సేఫ్ జోన్ లోకి అంతా వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది. సో యూఐడీఏఐ చేపడుతున్న ఈ మార్పులను అంతా స్వాగతించాల్సిందే.