కూటమి బడ్జెట్- మూడు ప్రాంతాల లెక్కలు ఇలా !
ఏపీలో టీడీపీ కూటమి బడ్జెట్ చూస్తే చాలా అర్థవంతంగా ఆశాజనకంగా ఉంది. అంతే కాదు వ్యూహాత్మకంగా ఉంది.;
ఏపీలో టీడీపీ కూటమి బడ్జెట్ చూస్తే చాలా అర్థవంతంగా ఆశాజనకంగా ఉంది. అంతే కాదు వ్యూహాత్మకంగా ఉంది. రాజకీయంగా కూడా కూటమి పైచేయి సాధించేందుకు వీలు అయిన బడ్జెట్ గా రూపొందించారు. ఈ బడ్జెట్ లో మూడు ప్రాంతాలకూ సమగ్రమైన సమానమైన అభివృద్ధిని చూపించారు. అంతే కాదు ఈ మూడు ప్రాంతాలను గ్రోత్ ఇంజన్లుగా మారుస్తూ ఏపీ మొత్తాన్ని ఒక అభివృద్ధి శకటంగా ముందుకు తీసుకుని వెళ్ళేలా డిజైన్ చేశారు. దాంతో అన్ని ప్రాంతాలకూ బడ్జెట్ లో చోటు దక్కింది. లెక్కలు అంకెలు గణాంకాలు అన్నీ కూడా సరిసమానంగా కూడి మరీ కూర్పు చేశారు అనిపించింది.
ఉత్తరాంధ్ర కు ఊతం :
ఇక ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక బడ్జెట్ తీసుకుంటే కనుక ఉత్తరాంధ్రా ప్రగతికి ఊపు తెచ్చేలా ఉంది అని అంటున్నారు. విశాఖ ఎకనామికల్ జోన్ పేరుతో ఏకంగా ఉత్తరాంధ్రా పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాలు అలాగే తూర్పు గోదావరి జిల్లాలతో కలుపుకుని బడ్జెట్ 28 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో ఈ ప్రాంతాలు పూర్తి అభివృద్ధిని సాధించేందుకు వీలు చిక్కేలా చర్యలు తీసుకుంటున్నారు.
కోస్తా జిల్లాకు వరంగా :
అదే సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి మొదలుకుని ఉమ్మడి కృష్ణా గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో విశేషమైన అభివృద్ధి చేసేందుకు అమరావతి ఎకనామికల్ జోన్ గా డిజన్ చేశారు. ఈ జిల్లాలలో ప్రాంతీయ వృద్ధిని పెంచడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. అంతే కాకుండా క్వాంటం టెక్నాలజీ, స్మార్ట్ ఇండస్ట్రియల్ ప్రాంతాలు కనెక్టివిటీపై దృష్టి సారించింది. దీనికి అవసరమైన మూలధన మౌలిక సదుపాయాల కోసం 2026-27 బడ్జెట్ లో ఏకంగా 6 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. ఆర్థిక చోదకాలుగా ఈ జిల్లాలను రూపొందించాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
రాయలసీమకి లాభసాటిగా :
ఇంకో వైపు చూస్తే రాయలసీమ జిల్లాల సమగ్రమైన అభివృద్ధి కోసం రాయలసీమ గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ కు పెద్ద ఎత్తున అంటే ముప్పయి వేల కోట్ల రూపాయల నిధులను తాజా బడ్జెట్ లో కేటాయించారు. దీంతో ఈ ప్రాంతాలు అన్నీ సమగ్రమైన ప్రగతిని సాధిస్తాయని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఒక విధంగా చూస్తే ప్రాంతీయ సమైక్యతని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రానికి సమగ్ర ఆర్థిక ఇంజిన్‌ను సృష్టించడానికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను అధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా రానున్న కాలంలో మార్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పోటీపడే ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది.
అసమానతలకు తావు లేకుండా :
ఇక 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంతా అమరావతికే వెళ్తోందని వైసీపీ ప్రచారం చేసింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని ప్రయోగాలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇవన్నీ గమనంలోకి తీసుకుని ఏ ప్రాంతంలోనూ వివక్ష లేకుండా ఎవరూ వేలెత్తి చూపించకుండా సమగ్రమైన అభివృద్ధికి బాటలు వేసేందుకు బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసింది అని అంటున్నారు. దీని వల్ల రాష్ట్రంలోని మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలూ సరిసమానంగా ముందుకు సాగేందుకు ఆస్కారం ఉంటుంది. అదే సమయంలో రాజకీయంగా వైసీపీకి విమర్శలు చేసేందుకు వీలు లేకుండా పోతుంది.