ఏం చెప్పారు నాయిని గారు...

Update: 2015-04-23 04:29 GMT

నల్లగొండ జిల్లాలో జరిగిన కరడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్ వివాదం రచ్చ ఇంకా కొనసాగుతోంది. విధులు నిర్వహణలో ఉన్న అమాయక పోలీసులను అకారణంగా కాల్చిచంపిన, ఖైదీగా ఉన్నప్పటికీ విచక్షణ రహితంగా వ్యవహరించిన ఈ తీవ్రవాది ఎన్ కౌంటర్ కొన్ని పార్టీలు కావాలనే రచ్చ చేశాయి. 'విశాల దృక్ఫథం ఉన్న మానవహక్కుల నాయకులు' కొందరు దీన్ని బూటకపు ఎన్ కౌంటర్ గా వర్ణించి తమ గొప్పతనం చాటుకున్నారు. అయితే  చాలామంది హర్షం వ్యక్తం చేశారు!

ఎప్పట్లాగానే ఈ ఎన్ కౌంటర్ కు మతం రంగు పులిమిన ఎంఐఎం పార్టీ దీని ఆధారంగా రచ్చ మొదలుపెట్టింది. అకారణంగా కాల్చిచంపారని గోలచేసింది. సీఎం కేసీఆర్ ను కొందరు మత పెద్దలతో కలిసి ఆ పార్టీ నాయకుడు అసదొద్దీన్ వినతి పత్రం అందజేశారు. తర్వాత ముఖ్యమంత్రి స్పందన బాగా లేదనే ప్రచారం మొదలుపెట్టింది ఎంఐఎం పార్టీ. అయితే సీఎం ఎన్ కౌంటర్ పై పూర్తి విచారణ జరపాలంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్ ) ను ఏర్పాటు చేశారు. 

Read more!

దానిపైనా బురదచల్లారు ఎంఐఎం నేతలు. తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టేలా ముందడుగు వేశారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత, 

రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి. మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) తమకు ఫ్రెండ్లీ పార్టీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ పార్టీలకు మాత్రమే స్థానం ఉంటుందని ఎంఐఎం తమ సొంత పార్టీ అన్నట్లు కితాబు ఇచ్చారు. 

అయితే ఎంఐఎంపై నాయిని ఈ అసందర్భ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనే ప్రశ్న ఎదురవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ కోర్టు ఒకవైపు తరుముతోంది. మరోవైపు పార్టీలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వచ్చిపడతాయి. ఈ రెండు ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఆకట్టుకునేందుకు, ఆ వర్గాలకు ప్రతినిధిగా చెప్పుకుంటున్న పార్టీకి అనుకూలంగా నాయిని మాట్లాడారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Tags:    

Similar News