దర్యాప్తు కమిటీ ముందు ప్రధాని హాజరు
పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఊహించన్ షాక్ తగిలే పరిణామం కనిపిస్తోంది. ఆయన్ను దర్యాప్తు చేసేందుకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయి. రూ.500 - రూ.1000 నోట్లను ఏ కారణం చేత నోట్ల రద్దును చేపట్టారని తెలుసుకునేందుకు ప్రధానికి సమన్లు ఇచ్చే అవకాశాలున్నట్లు పార్లమెంటరీ కమిటీ చీఫ్ వీకే థామస్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో వెల్లడించేందుకు తమను కలవాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనెల 20వ తేదీలోపు నోట్ల రద్దుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది. ఆ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కలిగిన ప్రభావాన్ని వివరించాలని పీఏసీ కోరిన విషయం తెలిసిందే.నవంబర్ 8న రూ.500 - వెయ్యి నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. అయితే నోట్ల రద్దు అంశంపై ఎవరినైనా ప్రశ్నించే అధికారం పీఏసీకి ఉందని థామస్ తెలిపారు. కానీ జనవరి 20న ఉర్జిత్ పటేల్ తో జరిగే సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ పీఏసీ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయిస్తే, తాము ప్రధానిని కూడా నోట్ల రద్దు అంశంపై విచారిస్తామని థామస్ అన్నారు.
కాగా... కేంద్ర వార్షిక బడ్జెట్ ను వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగానే పార్లమెంట్ సమావేశాల షెడ్యూలు వివరాలను రాజ్యసభ ఒక బులెటిన్ ద్వారా విడుదల చేసింది. ఆ షెడ్యూలు ప్రకారం ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ షెడ్యూలు ప్రకారం బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు, మలివిడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం పూర్తికాగానే ఆ రోజు రాజ్యసభ యథావిధిగా తన షెడ్యూలు ప్రకారం సమావేశాలను కొనసాగిస్తుందని బులెటిన్‌లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్ పేర్కొన్నారు. తొలి విడత సమావేశాలు మొత్తం పది రోజులు జరుగుతున్నా సభా కార్యకలాపాలు మాత్రం ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి. ఫిబ్రవరి 4 - 5వ తేదీలు శని - ఆదివారాలు కావడంతో సభా సమావేశాలు జరుగవు. సమావేశాలు ప్రారంభమైన రోజున రాష్ట్రపతి ప్రసంగం పూర్తికాగానే కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్‌లో సమర్పిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం పూర్తికాగానే రాజ్యసభ సమావేశమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/