పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ వెనుక అసలు కారణం ఇదేనా?

యుద్ధం మొదలై దగ్గర దగ్గర నెల కావొస్తోంది. మిగిలిన దేశాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.;

Update: 2026-03-26 11:30 GMT

యుద్ధం మొదలై దగ్గర దగ్గర నెల కావొస్తోంది. మిగిలిన దేశాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పిలిఫ్పీన్స్ లాంటి దేశంలో అయితే చమురు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇలాంటి వాటితో చూసుకుంటే.. మన దేశంలో ధరల పెంపు లేదు. దానికి తోడు కొరత అన్న మాట వినిపించింది లేదు. అయితే.. అనూహ్యంగా గడిచిన మూడు రోజులుగా.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం తర్వాతి నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వటం.. అది కాస్తా వైరల్ గా మారటంతో సోమవారం పరిస్థితి మారింది.

మంగళవారానికి వచ్చేసరికి ఆ ఇష్యూ తీవ్రత పెరగటంతో పాటు.. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించటం భారీగా పెరిగాయి. బుధవారంనాటికి వచ్చేసరికి అదో పెద్ద ఇష్యూగా మారటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి చమురు సంస్థలు.. పెట్రోల్ బంక్ యజమానుల సంఘాలు.. పౌర సరఫరాశాఖ అధికారుల వరకు అందరూ సీన్లోకి రావటం.. పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న ప్రకటనలు ఎవరికి వారిగా ఇస్తూ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాటను పదే పదే చెబుతున్నారు. అయినా.. పరిస్థితుల్లో మార్పు రాని పరిస్థితి.

దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్ని పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా హైదరాబాద్, విశాఖ, విజయవాడ తదితర నగరాలు.. పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వటానికి కారణమేంటి? అన్న విషయంలోకి వెళితే.. పలు అంశాలు కారణాలుగా కనిపిస్తాయి. వీటిల్లోకి వెళితే..

బ్యాలెన్స్ షీట్ ఇష్యూలు

తాజాగా కనిపిస్తున్న పెట్రోల్ కొరతకు కారణం చమురు సంస్థలు.. బ్యాంకులు అనుసరించే బ్యాలెన్స్ షీట్ వ్యూహాలుగా చెబుతారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వస్తున్నకొద్దీ దేశంలోని సంస్థలు తమ వార్షిక లెక్కల్ని సరి చేస్తుంటాయి. తాజా పరిస్థితుల్లోనూ ఎప్పటిలానే లెక్కలు తేల్చాలన్న పట్టుదల ఇంధన సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయానికి కారణంగా చెప్పాలి.

చమురు కొరత లేదా?

నిజంగానే దేశంలో చమురు నిల్వల కొరత ఏ మాత్రం లేదన్న మాట పదే పదే ప్రభుత్వంతో పాటు చమురు సరఫరా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. నౌకలకు చెల్లించే బీమా ప్రీమియాలు 30-50 శాతం పెరిగాయి. దీంతో చమురు దిగుమతి ఖర్చు భారీగా పెరిగింది. అదే సమయంలో సాధారణ పరిస్థితుల్లో వారంలో చేరుకోవాల్సిన ముడి చమురు నిల్వలకు ఇప్పుడు 15-20 రోజులు పడుతోంది. ఈ ఆలస్యం దేశీయ రిఫైనరీల మీద నిల్వల ఒత్తిడి పడుతోంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఈ ప్రభావం చూపే పరిస్థితి లేదు. దీర్ఘకాలంగా యుద్ధం సాగి.. సరఫరా మరింత ఆలస్యమైతే తప్పితే ఇబ్బందులు ఉండవు.

మరి.. నో స్టాక్ బోర్డులు ఎందుకు?

పెట్రోల్ బంకుల్లో నిల్వలు లేకపోవటానికి అసలు కారణం కంపెనీల వద్ద స్టాక్ లేకపోవటం కాదు. ఇదే విషయాన్ని ఇప్పటికే చమురు సంస్థలు పదే పదే స్పష్టం చేయటమే దీనికి నిదర్శనం. అదే సమయంలో పెట్రోల్ బంకుల యజమానుల సంఘాల వారు కూడా చెబుతున్నారు.

సమస్య ఎక్కడ ఉంది?

అసలు కారణం కంపెనీ వద్ద స్టాక్ లేకపోవటం కానే కాదు. అసలు సమస్య అంతా ఆర్థిక సంవత్సరం (ప్రతి ఏడాది మార్చి 31నాటికి ముగిసేది) ముగింపునకు వర్తించే నిబంధనలే దీనికి కారణంగా చెప్పాలి. మామూలు రోజుల్లో డీలర్లకు చమురు మార్కెటింగ్ సంస్థలు కొన్ని రోజుల రుణ పరిమితిని ఇస్తాయి. మార్చి నెల చివర మాత్రం దీన్ని తగ్గిస్తాయి. అప్పటివరకు ముందు చెల్లింపులు లేకుండానే పెట్రోల్ పంపుతాయి. కానీ.. మార్చి రెండు వారం తర్వాత నుంచి మాత్రం డబ్బులు చెల్లింపులు జరిపిన తర్వాతే స్టాక్ రిలీజ్ చేస్తాయి.

ఈ రూల్ కొత్తదేం కాదు. చాలామంది డీలర్లు నగదు సర్దుబాటు చేసుకోలేక కొత్త ఆర్డర్లు పెట్టలేకపోతారు. విడి రోజుల్లో జిదేం సమస్య కాదు. యుద్ధం కారణంగా కొరత భయాందోళనలు ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ లేని కొరతకు కారణమవుతుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. పెట్రోల్ బంకు యజమానులు క్యాష్ సర్దుబాటు చేయటంలో జరిగిన తప్పులు.. నో స్టాక్ బోర్డులు కనిపించేలా మారింది.

ఫ్యూచర్ అవసరాలకు కొనేయటం

సాధారణ రోజుల్లో వంద రూపాయిలకు పెట్రోల్ కొట్టించే టూవీలర్ వ్యక్తి.. పెట్రోల్ దొరకదు అన్నప్పుడు రూ.వెయ్యి పెట్రోల్ కొట్టిస్తాడు. ఒకళ్లు.. ఇద్దరు అలా చేస్తే ఫర్లేదు. లక్షలాది మంది అలా చేస్తే ఏమవుతుంది? పెట్రోల్ బంకుల్లో నిల్వలు పూర్తి అవుతాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే. దీన్నే ప్యానిక్ బయ్యింగ్ గా పేర్కొంటారు. తక్షణమే అవసరం లేకున్నా.. భవిష్యత్తు అవసరాల కోసం ముందుగా కొనేసి ఉంచటం.

బ్యాంకులు కూడా కారణం

చమురు డీలర్లు బ్యాంకుల నుంచి స్వల్ప కాలిక రుణాలు తీసుకొని చమురు సంస్థలకు డబ్బు చెల్లిస్తూ ఉంటారు. కానీ.. ఆర్థిక సంవత్సరం చివర్లో బ్యాంకులు సైతం తమ రుణాలను వీలైనంత తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తాయి. ఇందులో భాగంగా పాత బకాయిలు క్లియర్ అయ్యేలా చూసుకోవటం.. కొత్త రుణాలు ఇవ్వకుండా ఆపుతాయి. ఈ పరిస్థితి చివరకు పెట్రోల్ బంకు యజమానులకు తలనొప్పిగా మారింది. ఇలాంటి సాంకేతిక కారణాలు అన్ని కలగలిసి చివరకు నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చేలా చేశాయి.

Tags:    

Similar News