బ్యాటింగ్ ఎపుడు ట్విట్టర్ లోకేశా.. ?

Update: 2021-11-12 04:30 GMT
నారా వారి అబ్బాయిగానే లోకేష్ ఈ రోజుకీ ఏపీ పాలిటిక్స్ లో కనిపించడం తెలుగుదేశానికి కలవరపాటుకు గురి చేసే అంశమే. టీడీపీలో చంద్రబాబు తరువాత చైర్ తనదే అని ధీమాగా ఉన్న లోకేష్ తండ్రి రాజకీయ అనుభవాన్ని ఒకసారి విశ్లేషించుకుంటే బాగుంటుంది అన్న మాట ఉంది. చంద్రబాబు విద్యార్ధి నాయకుడిగా  ప్రారంభించి సొంతంగా ఎదిగి ఈ రోజుకు ఈ స్థాయికి చేరుకున్నారు. మరి లోకేష్ కి ఆ కింద మెట్లు అవసరం లేకుండానే బాబు పక్క దాకా వచ్చేశారు. రాజకీయాలో అందలాలు అనేవి ఒకరు ఇస్తే పుచ్చుకునేవి కావు. తమకు తాముగా వాటిని అందుకోవాలి. సాధించుకోవాలి.

లోకేష్ మాత్రం ఇంకా ట్విట్టర్ లోనే గట్టిగా ఉంటున్నారు తప్ప ఫీల్డ్ లోకి రావడం లేదు అన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. ఏపీలో ఏదినా ఘటన జరిగితేనే తప్ప లోకేష్ లాండ్ అవరు అన్న సెటైర్లూ ఉన్నారు. ఒక విధంగా పరామర్శల లోకేశం అని కూడా కామెంట్స్ పడుతున్నాయి. అనంతపురం వెళ్లి విద్యార్ధి నాయకులను, బాధిత విద్యార్ధులను  పరామర్శించడం మంచిదే. అయితే అలాంటి ఆందోళనలను తన నాయకత్వంలోనే ఏపీవ్యాప్తంగా లోకేష్ ఎందుకు నిర్మించలేకపోతున్నారు అన్నదే ఇక్కడ చర్చ.

లోకేష్ తలచుకుంటే ఏపీని షేక్ చేసే విధంగా ఉద్యమాలు చేయవచ్చు. టీడీపీకి క్షేత్ర స్థాయిలో ఉన్న బలం చాలా ఎక్కువ. క్యాడర్ ని రీచార్జి చేయాలే కానీ వారు ఉరుకులు పరుగులు పెడతారు. కానీ లోకేష్ మాత్రం ఎంతసేపూ ట్వీట్లు చేస్తూ జగన్ని విమర్శిస్తూ అందులోనే పరమానందాన్ని పొందుతున్నారు అంటున్నారు. ఇక ఏపీకి ఆయన చుట్టపు చూపుగానే వస్తున్నారు. ఏపీలో బ్రహ్మాండమైన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉంది. అక్కడ ట్వంటీ  ఫోర్ బై సెవెన్ లోకేష్ అందుబాటులో ఉంటే ఆ కధే వేరుగా ఉంటుంది అన్న వారూ లేకపోలేదు. కానీ లోకేష్ అబ్బాయి ఇంకా గ్రౌండ్ లోకి దిగడానికి ఎందుకో ఆలోచిస్తున్నారు అంటున్నారు.

అయితే లోకేష్ సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు సైకిల్ యాత్ర చెస్తారని అంటున్నారు. మరి అలాంటి యాత్రలు ఆ టైమ్ కి అందరూ చేస్తారు, పైగా అవి ఎన్నికల కోలాహాలంలో కొట్టుకుపోతాయి. అలా కాకుండా ఇప్పటి నుంచే గేర్ మార్చితేనే జనంలో తనకూ పార్టీకి మైలేజ్ వస్తుంది అన్నది లోకేష్ గుర్తించకలేకపోతున్నాడు అన్న మాట కూడా ఉంది. ఇప్పటికైనా లోకేష్ ట్విట్టర్ లోకాన్ని వీడి జనం రూట్లోకి రావాలని కూడా విలువైన సూచనలు అయితే  అందుతున్నాయి. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News