10% కాకపోతే 5%... నేతల మేతలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
అవును.. తేనె తీసిన వాడు నాకకుండా ఉంటాడా అనేది ఓ సామెత! ఇదే సమయంలో రాజకీయ నాయకుడు ముట్టకుండా ఉంటాడా అనేది సోషల్ మీడియా కామెంట్!;
అభివృద్ధి పనులకు, ఎంపీ ఫండ్స్ గా ఇచ్చిన నిధుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కమిషన్లు తీసుకుంటారా? అంటే.. సమాధానం చెప్పడం చాలా సులువని చాలా మంది అంటారు! ఈ విషయంలో నెంబర్స్ తో సహా చెబుతూ.. అందులో ఆప్షన్స్ కూడా ఇస్తూ.. పైగా ఆ కమిషన్ డబ్బులను పార్టీకి కూడా ఇవ్వాలంటూ కేంద్రమంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరీ ఓపెన్ అయిపోతున్నట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
అవును.. తేనె తీసిన వాడు నాకకుండా ఉంటాడా అనేది ఓ సామెత! ఇదే సమయంలో రాజకీయ నాయకుడు ముట్టకుండా ఉంటాడా అనేది సోషల్ మీడియా కామెంట్! ఈ రెండింటి నడుమ కేంద్రమంత్రి, హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్.ఏ.ఎం) అధినేత జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఎంపీలు, ఎమ్మెల్యేలు కమిషన్లు స్వీకరిస్తారని.. ఇందులో 10% సర్వసాధారణమని కుండబద్దలు కొట్టారు.
గయాలోని కళా సాంస్కృతిక కేంద్ర భవన్ లో కొత్తగా ఎన్నికైన హిందుస్తానీ అవామ్ మోర్చా ఎమ్మెల్యేలకు జరిగిన సన్మాన కార్యక్రమంలో జితన్ రామ్ మాంఝీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా. ప్రతీ ఎంపీ, ఎమ్మెల్యే కమిషన్ తీసుకుంటారని అన్నారు. ఒక ఎంపీ రూ.5 కొత్ల నిధిని పొందుతారని.. అందులో కాస్త అటు ఇటుగా 10% చొప్పున చూసుకుంటే.. రూ.40 లక్షలు పైనే వస్తుందని అన్నారు.
ఆ రూ.40 లక్షలు కమిషన్ ని పార్టీ నిధికి విరాళంగా ఇవ్వాలని.. ఒక వేళ 10శాతం కమిషన్ అందుబాటులో లేకపోతే.. 5 శాతానికైనా అంగీకరించాలని ఈ సందర్భంగా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ సలహా ఇచ్చారు. అంతే కాదు.. తాను కూడా కమిసన్ తీసుకుని పార్టీకి ఫండ్ ఇచ్చానని మాంఝీ చెప్పారు. ఇదే క్రమంలో.. తన కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ ని రాజ్యసభ ఎంపీగా చేయాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ రాజ్యసభ సీటు రాకపోతే నితీష్ ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా మాంఝీ చెప్పారు. ఇదే క్రమంలో.. మనకు ఒక ఎంపీ ఉంటే.. రూ.40 లక్షలు కమిషన్ గా వస్తున్నాయని.. ఇక, ఇద్దరు ఉంటే మనకు రూ.80 లక్షలు వస్తాయని.. దీని తర్వాత పార్టీకి ఇక డబ్బు అవసరం లేదని.. ఈ క్రమంలో మీరు 10 శాతం పొందలేకపోతే 5 శాతం మాత్రమే తీసుకోండి అని మాంఝీ సూచించారు.
ఇదే సమయంలో.. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తన పార్టీ ప్రణాళికలు మాంఝీ వివరించారు. హెచ్.ఏ.ఎం 100 స్థానాల్లో పోటీ చేయాలని ఆయన పట్టుబట్టారు. ఈ విషయంలో తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో.. తన కులానికి చెందిన ప్రజల మద్దతు తనకు ఉందని.. ఇతర కులాల మద్దతు కూడా తమకు అవసరమని చెప్పుకొచ్చారు. బీజేపీ తమ పార్టీని తక్కువ అంచనా వేస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో.. మాంఝీ వ్యాఖ్యలను "ఆయన వ్యక్తిగత అభిప్రాయం" అని బీజేపీ నాయకుడు దిలీప్ కుమార్ జైస్వాల్ అభివర్ణించారు.