ఐటీ జాబ్ వదిలేసి స్వీపర్ గా భారతీయ యువకుడు.. నెలకు లక్ష జీతం
ఈ 17 మంది ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో రోడ్డు నిర్వహణ సంస్థ ‘కొలొమ్యాజ్ స్కోయే’లో పనిచేస్తున్నారు.;
ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. ఇప్పుడు రోడ్లు ఊడ్చే పని.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇదేనిజం.. రష్యాలో పనిచేస్తున్న ఓ భారతీయ టెక్కీ చేసిన ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
26 ఏళ్ల ముకేష్ మండల్ భారతదేశంలో ఐటీ రంగంలో పనిచేశాడు. మంచిజీతం, స్థిరత్వం కోసం రష్యాకు వెళ్లాడు. అతడితోపాటు మొత్తం 17 మంది భారతీయులు అదే ఆశతో రష్యాకు వలసవెళ్లారు. కానీ అక్కడ వారికి దొరికిన పని ఐటీ కాదు.. వీధులు శుభ్రం చేసే ఉద్యోగం..
ఈ 17 మంది ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో రోడ్డు నిర్వహణ సంస్థ ‘కొలొమ్యాజ్ స్కోయే’లో పనిచేస్తున్నారు. కొన్ని వారాలుగా వీరు వీధులు ఊడ్చే పనిలో ఉన్నారు. కంపెనీ వీరికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా సుమారు 1 లక్ష రూపాయలకు పైగా (100000 రూబుల్స్) జీతం ఇస్తోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు విస్తుపోతున్నారు.
ఫొంటింకా అనే రష్యన్ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఈ గ్రూపులో ఉన్న వారి నేపథ్యాలు చాలా విభన్నంగా ఉన్నాయి. రైతులు, చిన్న వ్యాపారులు మాత్రమే కాదు.. ఒక వెడ్డింగ్ ప్లానర్, లెదర్ టానర్, డ్రైవర్లు, ఆర్కిటెక్ట్ లు కూడా ఇందులో ఉన్నారు. అందరిదీ ఒక్క లక్ష్యం మెరుగైన ఆదాయం.. ఈ నిర్ణయం గురించి ముకేష్ మాట్లాడుతూ.. ‘పని స్వభావం నాకు ముఖ్యం కాదు. పని దేవుడితో సమానం. నిజాయితీగా విధిని నిర్వర్తించడమే అసలు ముఖ్యము’ అని చెప్పాడు. అతని మాటలు చాలా మందికి ఆలోచన కలిగిస్తున్నాయి.
అయితే ఐటీ జాబ్ కు వెళ్లి స్వీపర్ గా చేరడం లాంటి నిర్ణయాలు మూర్ఖత్వంలా అనిపించవచ్చు.ఐటీ వంటి నైపుణ్యాలున్న ఉద్యోగాన్ని వదిలి.. విదేశాల్లో శారీరక శ్రమ ఎందుకు అనే ప్రశ్నలు సహజం. కానీ ఇది భారతదేశంలో ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ప్రతీ సంవత్సరం వేలాది మంది భారతీయులు మంచి జీతం, స్థిరమైన జీవితం కోసం విదేశాలకు వెళుతున్నారు. అందరిదీ విజయగాథ కాదు.చాలా మంది తక్కువ జీతాుల, అస్థిరమైన ఉద్యోగాలు,దోపిడీ పరిస్థితులతో పోరాడుతున్నారు.
జనాభా పెరుగుదల , ఉపాధి అవకాశాల కొరత , తీవ్రపోటీ.. ఇవన్నీ ఈ పరిస్థితికి ప్రధానకారణాలు. ఈ ఘటన ఒక్క వ్యక్తి కథమాత్రమే కాదు..ఇది దేశవ్యాప్తంగా జీవనోపాధిని ప్రభావితం చేస్తున్న లోతైన వ్యవస్థాగత సమస్యలకు అద్దం పడుతోంది.