మోడీ కేబినెట్ లో భారీ కుదుపులు....ముహూర్తం అపుడేనట !
బెంగాల్ లో గెలిచిన తరువాత బీజేపీ కేంద్రంలో చాలా మార్పులు తీసుకుని రావాలని చూస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక విధంగా ప్రక్షాళన చేపట్టాలని చూస్తోంది.;
కేంద్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. 2006 జూన్ 9 నాటికి రెండేళ్ళు పూర్తి అయి మూడవ ఏట మోడీ ప్రభుత్వం అడుగుపెడుతుంది. దాంతో భారీ ఎత్తున మంత్రివర్గంలో మార్పులకు ఆయన శ్రీకారం చుడతారు అని ఇప్పటి నుంచే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోంది. అయితే బీజేపీ చూపు అంతా పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీదనే ఉంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ నాలుగోసారి కూడా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. కానీ ఆమెకు ఆ చాన్స్ ఇవ్వరాదని మోడీ అండ్ టీం పట్టుదలగా ఉంది. ఎలాగైనా ఈసారి బెంగాల్ పీఠం మీద కాషాయ జెండాను నిలబెట్టాలని చూస్తోంది.
ఆపరేషన్ బెంగాల్ :
ఇప్పటికే ఆ దిశగా భారీ యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోవడమే కాదు అమలు కూడా చేస్తున్నారు. ఒక తడవ మోడీ అక్కడికి వెళ్ళి వచ్చారు. మమతా బెనర్జీ ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేశారు. అంతకు ముందే అమిత్ షా కూడా బెంగాల్ టూర్ వేశారు. ఆయన కూడా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టిగానే ఎటాక్ చేశారు. ఇక లోకల్ గా చూస్తే నాయకులు అందరూ కూడా కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. బెంగాలో హిందూత్వను బలంగా ముందుకు తెచ్చే ప్లాన్ కూడా క్రమపద్ధతిలో సాగుతోంది. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా బెంగాల్ ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సైతం బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.
యాంటీ ఇంకెంబెన్సీతో :
మమతా బెనర్జీ యాంటీ ఇంకెంబెన్సీ తో ఇబ్బంది పడుతోంది. ఏకంగా పదిహేనేళ్ళ పాటు ఆమె సీఎం గా అధికారంలో ఉన్నారు దాంతో సహజంగా ప్రజా వ్యతిరేకత ఉంటుంది. ఇక బలమైన ఆల్టర్నేషన్ గా బీజేపీ నిలవడం కూడా కమలనాధులకు కలసి వస్తోంది. అక్కడ ఒకప్పుడు గట్టిగా ఉన్న వామపక్షాలు కాంగ్రెస్ ఇపుడు తగ్గిపోవడం కూడా బీజేపీకి బాగా అనుకూలిస్తోంది. దాంతో బెంగాల్ మాదే అని బీజేపీ ఎక్కడ లేని విశ్వాసం ప్రకటిస్తోంది.
బెంగాల్ గెలుపు తరువాత :
బెంగాల్ లో గెలిచిన తరువాత బీజేపీ కేంద్రంలో చాలా మార్పులు తీసుకుని రావాలని చూస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక విధంగా ప్రక్షాళన చేపట్టాలని చూస్తోంది. ప్రస్తుతం మోడీ కేబినెట్ లో 72 మంది మంత్రులు ఉన్నారు. నిబంధనల ప్రకారం చూస్తే 81 మంది దాకా తీసుకోవచ్చు. అంటే దాదాపుగా పది ఖాళీల దాకా ఉన్నాయన్న మాట. వాటితో పాటు రెండేళ్ల పాటు పనిచేసిన మంత్రుల పనిచేసిన మంత్రుల పనితీరుని కూడా గమనంలోకి తీసుకుని కొందరికి ఉధ్వాసన పలుకుతారు అని అంటున్నారు. అంటే తక్కువలో తక్కువ ఒక పది నుంచి పన్నెండు మంది దాకా కొత్త ముఖాలు మోడీ మంత్రివర్గంలో ఈసారి కనిపిస్తాయని అంటున్నారు.
యూత్ కేబినెట్ :
అంతే కాదు వారంతా యూత్ అయి ఉంటారని చెబుతున్నారు. ఇప్పటికే బీహార్ కి చెందిన 45 ఏళ్ళ నితిన్ నబిన్ ని ఏరి కోరి మరీ ఎంపిక చేసిన బీజేపీ అదే విధానంలో కేంద్ర మంత్రివర్గంలో యువతకు పెద్ద పీట వేయాలని చూస్తోంది అని అంటున్నారు. అంతే కాదు బెంగాల్ లో బీజేపీ గెలిస్తే ఆ రాష్ట్రానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు. ప్రస్తుతం బెంగాల్ నుంచి ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. రేపటి మార్పు చేర్పులలో రెండు కేబినెట్ బెర్తులు కూడా ఇవ్వడానికి కూడా బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. మొత్తం మీద అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ యూత్ కే పట్టం కట్టాలని బీజేపీ చూస్తోంది అని చెబుతున్నారు. ఇదంతా 2029 లో జరగబోయే ఎన్నికల కోసమే అని అంటున్నారు. మొత్తానికి కేంద్ర కేబినెట్ లో భారీ కుదుపులు అయితే కచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు. మరి ఇన్ ఎవరో అవుట్ ఎవరో తేలాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే.