కాళేశ్వరంపై బాంబులు వేసి పేల్చారు? కేటీఆర్ సంచలన ఆరోపణలు

ఇక రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని కేటీఆర్ విమర్శించారు. చెక్ డ్యాములపై జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్.;

Update: 2025-12-23 17:56 GMT

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కేసీఆర్ రేపిన మాటల మంటల వేడి రగులుకుంటూనే ఉంటుంది. దానికి కౌంటర్ గా సీఎం రేవంత్, మంత్రులు ఎదురుదాడిచేశారు. ఇప్పుడు దానికి రీకౌంటర్ గా కేటీఆర్ రంగంలోకి దిగారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారశైలి చూస్తుంటే ప్రజాపాలనలా కాకుండా ‘పక్కా మాఫియా పాలన’లా ఉందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా గత కేసీఆర్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నం లేదని ఆరోపించారు.

2023 ఎన్నికల ముందే బహుళార్ధ సాదక ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై బాంబులు వేసినట్టుగా అనుమానాలున్నాయని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రాజెక్ట్ కు నష్టం జరిగిందన్న సందేహాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది సహజ వైఫల్యం కాదని.. మానవ నిర్మిత విధ్వంసమేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇక రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని కేటీఆర్ విమర్శించారు. చెక్ డ్యాములపై జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్ డ్యామ్ లు ఇసుక దోపిడీకి అడ్డుగా ఉన్నాయని.. అందుకే వాటిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చెక్ డ్యాములు కడితే.. ఇప్పుడు వాటిని కూల్చివేసి పొలాలను ఎడారులుగా మారుస్తున్నారని మండిపడ్డారు.

‘వాటర్ మాన్ గా పేరొందిన రాజేంద్రసింగ్ కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ప్రాజెక్టులను నాశనం చేస్తున్నారని చెబుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులు, చెక్ డ్యాముల ధ్వంసానికి బాధ్యులైన వారిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మొత్తానికి కాళేశ్వరంపై బాంబులు, చెక్ డ్యాముల పేల్చివేత అంటూ కాంగ్రెస్ పెద్దబాంబులే వేశారు కేటీఆర్. దీనికి కాంగ్రెస్ నుంచి ఏం సమాధానం వస్తుందో చూడాలి మరీ..

Tags:    

Similar News