బంగ్లాదేశ్ కు బెత్తం దెబ్బలు.. తెరపైకి 'ఆపరేషన్ సిందూర్ – 2'!

ఈ నేపథ్యంలో ఆ ఘటనలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.;

Update: 2025-12-23 20:30 GMT

పహల్గాంలోకి చొరబడిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడున్న పర్యాటకుల మతం అడిగి, కన్ ఫాం చేసుకుని మరీ హిందువులను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారతదేశ ఆడపడుచుల నుదిటిన సిందూరం చెరిగిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం అందుకు ప్రతికారంగా "ఆపరేషన్ సిందూర్" చేపట్టింది. ఇదే క్రమంలో.. ఇప్పుడు బంగ్లాలోని హిందువులను లక్ష్యంగా చేసుకుని మారణహోమం జరుగుతున్న నేపథ్యంలో “ఆపరేషన్ సిందూర్ -2” డిమాండ్ తెరపైకి వచ్చింది.

బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల పాతికేళ్ల హిందూ వ్యక్తి దిపూ చంద్ర దాస్ పై దాడి చేసిన మూక.. అత్యంత కిరాతకంగా అతడిని హత మార్చింది. దీన్ని భారతదేశం మొత్తం ఖండించింది. బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులపై దాడుల ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ - 2 డిమాండ్ తెరపైకి వచ్చింది.

అవును... తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న హిందూ వ్యతిరేక చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఘటనలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ కార్యాలయం వద్దకు విశ్వ హిందూ పరిషత్ (వీ.హెచ్.పీ) కార్యకర్తలు భారీగా చేరుకొని నిరసన చేపట్టారు. దీంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఆందోళనల్లో బజరంగ్ దళ్ కూడా భాగమైంది. ఈ సమయంలో వీరంతా కలిసి ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఎంబసీ వద్ద నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలను ముందుగానే అంచనా వేయడంతో పోలీసులతో పాటు పారామిలటరీ కలిపి సుమారు 15,000 మంది భద్రతా సిబ్బందిని ముందుగానే రంగంలోకి దింపారు. మూడు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన నిరసనకారుల్లో ఒకరు... ఒక హిందూ వ్యక్తిపై దారుణంగా దాడి చేసి చంపారని.. హత్య వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము తమ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని.. బంగ్లాదేశ్ పోలీసులు కూడా హత్య వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము నిరసన తెలుపుతున్నామని అన్నారు. "ఈ రోజు మనం గొంతు ఎత్తకపోతే రేపు నేను దీపు అవుతాను.. నువ్వు కూడా దీపు అవుతావు" అంటూ మరో నిరసనకారుడు అన్నారు.

ఇదే సమయంలో.. దీపూ చంద్ర దాస్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది నిరసనకారులు బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిసూ నినాదాలు చేశారు. అదేవిధంగా.. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ ముహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను నిరసనకారులు దహనం చేశారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ పై ఆపరేషన్ సిందూర్ - 2 చేపట్టాలని వీ.హెచ్.పీ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి! దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది!

ఈ నిరసనలను బంగ్లాదేశ్ ఖండించింది. దౌత్య సంస్థలపై ముందస్తుగా ఉద్దేశించిన హింస, బెదిరింపు చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇది దౌత్య సిబ్బంది భద్రతకు హాని కలిగించడమే కాకుండా.. పరస్పర గౌరవం, శాంతి, సహనానికి సంబంధించిన విలువలను కూడా దెబ్బతీస్తుందని ఢాకాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదే సమయంలో.. ఈ సంఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని.. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా నిరోధించాలని.. అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని.. భారత్ లోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలు, సంబంధిత సౌకర్యాల భద్రతను నిర్ధారించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది.

Tags:    

Similar News