లోకేష్.. ట్విటర్ దాటి వస్తున్నారా?

Update: 2019-07-18 08:25 GMT
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఇప్పటికే చాలా రకాలుగా అభాసుపాలయ్యారు. అధికారం చేతిలో ఉన్నంత సేపూ నారా లోకేష్ ఏదోలా చలామణి అయిపోయారు. అయితే ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోవడం ఆయనకు పెద్ద మరకగా మారింది. చంద్రబాబు నాయుడు తనయుడు అనే ట్యాగ్ తో మంత్రి పదవిని తీసుకుని - ఎమ్మెల్సీగా సెటిలయ్యారాయన. ఒకవేళ ఎన్నికల ముందు ఆవేశ పడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో చెప్పనక్కర్లేదు.

ఆ సంగతలా ఉంటే.. ఎన్నికల తర్వాత లోకేష్ బాబు ట్విటర్ కే పరిమితం అయ్యారు. బయట అడపాదడపా కనిపిస్తున్నా..అక్కడ గట్టిగా ఏదైనా పాయింట్ మీద మాట్లాడి లోకేష్ వార్తల్లోకి రావడం లేదు. మీడియాకు వరస పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు.

అయితే ట్విటర్లో మాత్రం చినబాబు చాలా హడావుడి చేస్తూ ఉంటారు. పెద్దపెద్ద పదాలతో కూడిన ట్వీట్లు పోస్ట్ అవుతూ ఉంటాయక్కడ. కానీ ఆ ట్వీట్లు ఎవరో రాస్తున్నారు, లోకేష్ పేరు మీద పోస్ట్ అవుతున్నాయి తప్ప.. అదంతా లోకేష్ మేధస్సు కాదు అనే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి.

ఏదేమైనా ప్రజల మధ్యకు వచ్చి నిరూపించుకుంటే తప్ప లోకేష్ పై జనాల్లో - తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నమ్మకం పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. అందుకోసమే లోకేష్ ట్విటర్ దాటి వస్తున్నారట. ఆయన ఒక పాదయాత్రను చేపట్టనున్నారట!

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా ఇలాంటి ప్రచారం అయితే ఒకటి మొదలైంది. లోకేష్ ట్విటర్ దాటబోతున్నారని, జనాల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆ పాదయాత్ర సుదీర్ఘమైనది కాదట. ఎప్పటికప్పుడు మొదలై, అప్పుడే ముగుస్తుందట. ఇలా ఏదో ప్లాన్ చేస్తున్నారట.

లోకేష్ పాదయాత్ర చేయగలడా? ఆయన నడవగలడా? అనేది ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తూ ఉన్న మాట. మొత్తానికి ఏదోలా లోకేష్ నిరూపించుకోవాల్సిన సమయం రానే వచ్చింది. ఇప్పుడు నిరూపించుకోలేకపోతే మాత్రం కష్టమేనేమో అని అంటున్నారు పరిశీలకులు.
Tags:    

Similar News