దరిద్ర పాదంతోనే పులిచింతల గేటు విరిగిందా? ఇదెక్కడి లెక్క లోకేశా?

Update: 2021-08-06 11:01 GMT
నిత్యం ఏదో ఒక ఇష్యూతో ఏపీ రాజకీయం హాట్ హాట్ గా ఉంటుంది. అప్పుడప్పుడు చోటు చేసుకునే అనూహ్య ఘటనలు ఈ వేడిని మరింత పెంచి.. రచ్చ రచ్చగా మారేలా చేస్తుంది.తాజాగా అలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.పులిచింత ప్రాజెక్టు గేటు విరిగిపోయిన వైనంతో ఇప్పుడు రాజకీయ రచ్చకు తెర తీసినట్లైంది. వరద తీవ్రతతో విరిగిన గేటు కారణంగా..భారీ ఎత్తున నీరు సముద్రంలోకి పోవటం ఒక ఎత్తు అయితే.. ఎంతో దృఢంగా ఉండాల్సిన గేటు వరద ఉధృతికి విరిగిపోయిందన్న వాదనలో పస ఉండదు. ఈ పాపం ఎవరి మెడకు వేయాలన్న దానిపై కిందామీదా పడుతున్న వారికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుణ్యమా అని జవాబు లభించింది.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన జలయజ్ఞంలోని అవినీతే తాజా పరిణామాలకు కారణమన్న వాదనను ఆయన వినిపిస్తున్నారు. మసాలా దట్టించిన పోస్టుల్ని సోషల్ మీడియాలో పెడుతూ.. హీట్ పెంచేస్తున్నారు. "జలయజ్ఞం పేరుతో మహా"మేత"… దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఊడిపడిన గేటు… సముద్రంపాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు… తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్" అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు లోకేశ్.

ఇదిలా ఉంటే వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. 2003లో పులిచింతల కాంట్రాక్టును టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అప్పజెప్పింది. ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉన్నాయని 2015లో నిపుణుల కమిటీ తేల్చిందన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు వైఎస్ కు కానీ.. జగన్ కు కానీ ఇందులో సంబంధం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. గ్రౌటింగ్ చేసేందుకు 24 బోర్లు తవ్వి వదిలేశారని.. దీంతో స్పిల్ వేలో భారీ ఎత్తున లీకేజీలు ఏర్పడినట్లుగా అధికారులు చెబుతున్నారు.

అప్పట్లో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నివేదికలు ఇస్తే అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. ఈ కారణంగానే 16వ గేటు ఊడిపోవటానికి కారణమైందన్న మాట వినిపిస్తోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో.. వరద పెరిగే కొద్దీ ముంపునకు గురయ్యే ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల్ని అలెర్టు చేశారు. టీడీపీ నేత చేపట్టిన పనుల్ని తమ అధినేతకు లింకు పెట్టటంపై ఏపీ అధికారపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే.. లోకేశ్ చేసిన ట్వీట్ మరింత హీటు పుట్టేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. సంబంధం లేని అంశాలతో.. విషయాన్ని పక్కదారి పట్టించటమే లోకేశ్ లక్ష్యమన్న ఆగ్రహం వినిపిస్తోంది. ఆయన పుణ్యమా అని ఈ ఇష్యూ మీద రానున్న రోజుల్లో మరింత మాటల యుద్ధం ఖాయమని చెబుతున్నారు.

Tags:    

Similar News