చినబాబు నిఘాలో టీడీపీ ఎంపీలు

Update: 2019-02-15 13:21 GMT
కులానికో కార్పొరేషన్ ప్రకటించి.. డ్వాక్రా మహిళలకు ఫోన్లు - లోన్లు ప్రకటించి... కేంద్రం ఇచ్చేదానితో కలిపి రైతులకు ఏడాదికి రూ. 10 వేలు ప్రకటించి.. ఆటోలు - ట్రాక్టర్లపై ట్యాక్సులు ఎత్తేసి.. నిరుద్యోగులకు భృతి ప్రకటించి.. పింఛన్లు రూ.2 వేలు చేసి.. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ఇచ్చి.. ఇలా అందరికీ వరాలిస్తూ అంతా బాగుందని చంద్రబాబు ఫీలవుతున్న వేళ ఊహించని షాక్‌ లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కరొక్కరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరగా.. మొన్న ప్రకాశంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి... నిన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు మరో ఎంపీ కూడా అవంతి బాటలోనే వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
  
దీంతో ఆ ఎంపీ ఎవరన్నది అర్థం కాక టీడీపీ పెద్దలు ఎంపీలందరిపైనా నిఘా పెట్టారని తెలుస్తోంది. తమ ఎంపీలు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారు. వారిని ఎవరు కలుస్తున్నారు.. వారు ఎవరిని కలుస్తున్నారు వంటివన్నీ ఎప్పటికప్పుడు లోకేశ్ బాబు సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
  
పైగా ఇప్పటికే నలుగురైదుగురు ఎంపీలు అసెంబ్లీ టిక్కెట్లు అడగడం.. లోక్ సభకు పోటీ చేయడానికి మొగ్గు చూపకపోవడంతో అలాంటివారిపైనా కన్నేసి ఉంచినట్లు చెబుతున్నారు. మరోవైపు ఓ ఎంపీ వైసీపీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన సంగతీ వెల్లడైందట. అయితే.. ఆయన్ను బెదిరించే ధోరణి కాకుండా బుజ్జగించి పార్టీలోనే ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
  
ఉత్తరాంధ్రలోని ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ నుంచి తమ స్థానాలకు టిక్కెట్ హామీ పొందారట. దీంతో ప్రతిజిల్లాలో అందరు ఎంపీలు - ఎమ్మెల్యేలను పార్టీ అధిష్ఠానం అనుమానంగానే చూస్తోందట. ఈ క్రమంలో రానున్న రెండు మూడు వారాల్లో బుజ్జగింపులు గట్టిగా ఫలిస్తే తప్ప వలసలు ఆగేలా లేవని చెబుతున్నారు.


Tags:    

Similar News