లోకేశా!... దావోస్‌ లో రాజ‌కీయాలేంట‌య్యా?

Update: 2019-01-25 10:06 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రి నారా లోకేశ్... ఇప్పుడు దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ప్ర‌పంచ ఆర్థిక సద‌స్సు వార్షిక స‌మావేశాల్లో పాలుపంచుకునేందుకు వెళ్లిన లోకేశ్... అక్క‌డికి వ‌చ్చే ప‌రిశ్ర‌మల అధినేత‌లు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రాష్ట్రంలోని పారిశ్రామిక సానుకూల అంశాల‌ను వివ‌రించ‌డంతో పాటు వారి పెట్టుబ‌డుల‌ను రాష్ట్రానికి తీసుకుని రావ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. వాస్త‌వానికి ఈ ప‌ర్య‌ట‌న‌కు లోకేశ్ తండ్రి, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వెళ్లాల్సి ఉంది. అయితే ఉన్న‌ట్టుండి ప్లాన్ మార్చేసిన చంద్రబాబు... ఎన్నిక‌ల్లో వ్యూహాల్లో తానుంటాన‌ని, దావోస్ లో చక్రం తిప్పి రావాల‌ని లోకేశ్ ను పంపారు. అయితే లోకేశ్ అక్క‌డికి వెళ్లి ఇప్ప‌టిదాకా ఏం సాధించారో తెలియ‌దు గానీ... తాజాగా అక్క‌డే ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఏపీలోని పారిశ్రామిక అనుకూల అంశాలు, కొత్గా పెట్టుబ‌డుల‌తో వ‌చ్చే వారికి త‌మ ప్ర‌భుత్వం ఇవ్వ‌నున్న ప్రోత్సాహ‌కాల‌ను వివ‌రించ‌డం మ‌రిచిపోయారేమో. ఏకంగా ఏపీలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను గురించి,  ఆయా పార్టీల మ‌నోగ‌తాల గురించి, ఆ పార్టీల భ‌విష్య‌త్తు గురించి చాలా లెంగ్తీగానే మాట్లాడారు. అంతేనా... మ‌రో మూడు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ టీడీపీనే విజ‌యం సాధిస్తుంద‌ని కూడా లోకేశ్ జ‌బ్బ‌లు చ‌రుచుకున్నారు.

అయినా దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి.... అక్క‌డికి వ‌చ్చే వారికి ఏపీ రాజ‌కీయాల గురించి ఏమాత్రం అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని మ‌రిచిన లోకేశ్ అక్క‌డ.... ఇక్క‌డి రాజ‌కీయాల గురించి త‌న‌దైన శైలిలో ఊక‌దంపుడు ప్రంస‌గం దంచేశారు. అయినా దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీ పాలిటిక్స్ గురించి ఏమైనా తెలుసా? అంటే తెలియ‌ద‌నే స‌మాధానమే వ‌స్తుంది. అంతేకాకుండా అస‌లు రాజ‌కీయాల‌తో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు పెద్ద‌గా ప‌ని కూడా ఉండ‌ద‌నే చెప్పాలి. అధికారంలో ఎవ‌రు ఉంటే... వారి ప్రాప‌కం కోసం త‌మ‌దైన య‌త్నాలు చేయ‌డంతో పాటు పెట్టుబ‌డుల‌తో వ‌స్తున్నామంటూ ఆయా ప్ర‌భుత్వాల‌ను వారు త‌మ‌వైపున‌కు ఈజీగానే తిప్పేసుకుంటారు. మ‌రి లోకేశ్ దావోస్ లో ఈ రాజ‌కీయ ప్రంసంగాలు ఎందుకు చేశారో ఆయ‌న‌కే తెలియాలి. అస‌లు రాజ‌కీయాలంటేనే పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌ని పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీ పాలిటిక్స్ అంటే ఎందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు చెప్పండి.

అయినా అక్క‌డ‌కు వ‌చ్చే మీడియా కూడా సాంతం బిజినెస్ కోణంలో ఆలోచించి, ఆ కోణంలోనే వార్త‌ల‌ను వండి వార్చే ర‌కం. మ‌రి లోకేశ్ గారి పొలిటిక‌ల్ కామెంట్ల‌ను ఆ చానెల్‌ కు ఎందుకు చెప్పండి. పోనీ... దావోస్‌ లోనూ లోకేశ్ కు రాజ‌కీయాలే మాట్లాడాలి అనుకుంటే... కాస్తైనా స్ప‌ష్ట‌త లేకుంటే ఎలా?  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్ క‌లిసి ప‌నిచేశాయి క‌దా. మ‌రి ఏపీలో ఆ రెంటి మ‌ధ్య పోటీ లేద‌ని చెబుతున్నారు క‌దా. మ‌రి ఎన్నిక‌లైన త‌ర్వాత అయినా ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటుందా? అంటే... లోకేశ్ నీళ్లు న‌మిలార‌ట‌. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పుకొచ్చార‌ట‌. అస‌లు రాజ‌కీయాలే అన‌వ‌స‌రైన వేదిక‌ల మీద పాలిటిక్స్ మాట్లాడి... ఆ పాలిటిక్స్ మీదా స్ప‌ష్ట‌త లేని లోకేశ్.. ఏం సాధించ‌డానికి అక్క‌డికెళ్లారోనన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


Tags:    

Similar News