సీఎం జగన్ తో భేటీ గురించి నాగ్ అడిగితే చిరు ఏం చెప్పారు?

Update: 2022-01-19 03:31 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన భేటీ పెద్ద ఎత్తున చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. భేటీ తర్వాత.. చిరుకు రాజ్యసభ సీటును సీఎం జగన్ ఆఫర్ చేసినట్లుగా కూడా వార్తలు రావటం.. వాటికి స్పందించిన చిరు వివరణ ఇవ్వటం తెలిసిందే. మధ్యలో సీపీఐ నారాయణ తెర మీదకు వచ్చి.. ఇండస్ట్రీ సమస్యల మీద మాట్లాడేటప్పుడు ఒక్కరే ఎలా వెళతారు? వన్ టు వన్ మీటింగ్ ఏమిటి? అంటూ ప్రశ్నించటమే కాదు.. ఈ భేటీ గురించి సందేహాలు ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యలు మరోలాంటి చర్చకు తెర తీశాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా సీఎం జగన్ తో చిరు భేటీలో ఏమైందంటూ.. మెగాస్టార్ ను ఎవరైనా నేరుగా అడిగారా? అడిగితే ఆయన సమాధానం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా కింగ్ నాగార్జున నిలుస్తున్నారు. తాజాగా బంగార్రాజు మూవీ బ్లాక్ బస్టర్ మీట్ ను రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన నాగార్జున తన ప్రసంగంలో ఆసక్తికర విషయాల్నివెల్లడించారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన భేటీ గురించి మిత్రుడు చిరంజీవిని అడిగానని.. సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని ముఖ్యమంత్రి తనకు చెప్పారంటూ చిరంజీవి తెలిపినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నందమూరి తారకరామారావు.. అక్కినేని నాగేశ్వరరావులు రెండు కళ్ల లాంటి వారని అందరూ అంటుంటారని.. ఈ రోజు ఎన్టీఆర్ వర్థంతి.. తెలుగు సినిమా ఉన్నంతవరకూ ఆయన్నుమనం గుర్తుచేసుకోవాలి.. చేసుకుంటామన్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. సీఎం జగన్ తో భేటీ గురించి చిరంజీవిని అడిగినప్పుడు.. మంచి జరుగుతుందన్న మాట చెప్పటం సరే.. ఆ మంచి ఏమిటన్న విషయాన్ని నాగ్ అడగలేదా? ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్లు కనిపిస్తుందే తప్పించి.. వివరాలు వెల్లడించే ఆలోచన లేదన్నట్లుగా నాగార్జున మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News