మున్సిపల్ పోరు : ఆ నామినేషన్ల 'విత్‌ డ్రా 'లు చెల్లవు .. జగన్ సర్కార్ కి నిమ్మగడ్డ మరో షాక్ !

Update: 2021-02-16 16:30 GMT
ఏపీలో ఎస్ ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ,  ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతుంది. ఇక తాజాగా ఓ వైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే .. మున్సిపల్ ఎన్నికలకి నోటిఫికేషన్ జారీచేశారు. గతంలో ఆ ప్రక్రియ ఎక్కడైతే ముగిసిందో , అక్కడి నుండి ఆ ప్రక్రియను మొదలుపెట్టబోతున్నట్టు నిమ్మగడ్డ తెలిపారు.

గతంలో వేసన నామినేషన్లకు ఆమోద ముద్ర వేశారని భావిస్తున్న తరుణంలో వాటి పై సర్కారుకు, వైసీపీ పార్టీకి షాకిచ్చేలా నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మున్సిపల్ పోరులో అధికార పార్టీకి ఇబ్బందులు సృష్టించటం ఖాయంగా కనిపిస్తోంది.

పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తరహాలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఉండదు. దీనితో  అధికారంలో ఉన్న పార్టీలు తాము నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకోవడం కోసం ప్రత్యర్ధులతో నామినేషన్ల ఉపసంహరణకు దిగుతుంటాయి. గతంలో ఏపీలో వాయిదా పడిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

వీటిపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన ఎస్ ఈ సీ నిమ్మగడ్డ.. ఈసారి మాత్రం వాటి గురించి ప్రస్తావించకుండా తొలుత మున్సిపల్‌ ఎన్నికల కొత్త షెడ్యూల్ ఇచ్చారు. అయితే అంతలోనే విపక్షాల అభ్యంతరాలతో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై సమీక్షిస్తామని ప్రకటించారు. గతంలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వందల సంఖ్యలో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన అసాధారణ నామినేషన్ల ఉపసంహరణను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ రోజు ప్రకటించారు.
Tags:    

Similar News