బాబుపై ముద్ర‌గ‌డ సెటైర్ అదిరిపోయిందిగా

Update: 2017-01-10 07:42 GMT
ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబునాయుడు చ‌ర్య‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. విభజించి పాలించు రీతిలో  కాపుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారని, ఈ ఎత్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని కాపు సోద‌రుల‌కు ముద్ర‌గ‌డ పిలుపునిచ్చారు. కాపులకు రిజర్వేషన్ల సాధనలో భాగంగా గత కొద్ది రోజులుగా రాష్టవ్య్రాప్తంగా సాగిస్తున్న వివిధ రకాల ఉద్యమాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా డి.గన్నవరం మూడు రోడ్ల కూడలిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ముద్రగడ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ తీరును విశ్లేషించారు.

కాపులు ఫ్లడ్‌ లైట్ల వెలుగులు కోరుకోవడం లేదని - కనీసం కొవ్వొత్తి వెలుగులు ప్రసాదించమని కోరుతుంటే దానికి కూడా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ససేమిరా అంటున్నారని ముద్ర‌గ‌డ పద్మ‌నాభం ఎద్దేవా చేశారు. బీసీ వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేయాలని కోరుతున్నామని ముద్ర‌గ‌డ పున‌రుద్ఘాటించారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయాలని కోరడాన్ని తప్పుగా చిత్రికరిస్తూ ఇతరులను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే ఆ తదుపరి వచ్చిన నేతలు నాటకీయ పరిణామాల మద్య తీసివేసి అన్యాయం చేశారని ముద్ర‌గ‌డ అన్నారు. అనంతరం మరో ఎస్సీ నేత తిరిగి పునర్ధురించారని, కాపులకు ఎస్సీ నేతలు అప్పుడు ఇప్పుడూ కూడా సహకరించారన్నారు. అమలాపురం టీడీపీ ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా కాపుల రిజర్వేషన్‌ పై సానుకూలంగా స్పందించారని ముద్ర‌గ‌డ తెలిపారు. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మహిళలు ఇస్తున్న మద్దతును ఎప్పటికీ మరువలేనని ముద్రగడ అన్నారు. కాపులు శాంతికాముకులని, ఈ నెలలో జరగనున్న పాదయాత్రలో శాంతియుతంగా ముందుకు నడిచి ఇతర కులాల మన్నలను పొందేలా ఉద్యమం ముందుకు సాగాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. కాగా... కాపు జేఏసీ పిలుపు మేరకు డి గన్నవరం మూడు రోడ్ల కూడలిలో నిర్వహించిన కొవ్వుత్తుల ప్రదర్శనకు అపూర్వ స్పందన లభించింది. డి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుండి కాపు యువకులు మహిళలు వేలాదిగా తరలి వచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News