అనుమతుల్తో సరిపెడతారో వరాలు కురిపిస్తారో!

Update: 2015-10-10 17:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అత్యంత అద్భుతంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి.. పర్యావరణ అనుమతులు, కేంద్రం నుంచి రావాల్సిన ఇతర అనుమతులు త్వరలోనే వచ్చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత పెద్ద ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇంత భారీ వ్యయంతో చేపడుతున్నప్పుడు.. దానికి అనుమతుల పరంగా పెద్దగా ఆటంకాలు ఎదురుకాకపోవచ్చు గానీ.. కేంద్రం పెద్దలు అనుమతుల్తోనే సరిపెడతారా..? లేదా, వారి మీద ఈ రాష్ట్ర ప్రజలు ఎలాంటి వరాల కొరకు ఆశలు పెంచుకుంటున్నారో.. ఆ వరాల జల్లును కూడా కురిపిస్తారా లేదా? అనేది ఇప్పుడు సందేహంగా ఉంటోంది.

మన అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తున్నారంటే అందులో ఒక సంతోషకరమైన విషయం దాగి ఉంది. ఎన్నికలకుముందు.. అప్పటికి అమల్లోకి రాని అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నరేంద్రమోడీ చాలా వరాలే గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే.. ఈ అనాథ రాష్ట్రాన్ని అభ్యున్నతిలో నడిపించడానికి.. .ఢిల్లీకంటె గొప్ప రాజధానిని తీర్చిదిద్దడానికి తాను ఏం చేయగలనో ఆయన చాలా హామీలు ఇచ్చారు. అలాంటి మోడీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడచిపోయాయి. ఇప్పటిదాకా ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మంచిచెడుల గురించి పెదవివిప్పి పల్లెత్తు ప్రకటన చేసింది లేదు. అలా నిందించడం కంటె.. అందుకు తగిన సందర్భం రాదని అన్నా కూడా సబబుగానే ఉంటుంది.

ఇప్పుడు ఆయన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారు. దీనికి సంబంధించి.. కార్యక్రమానికంటె ముందుగానే.. అక్కడ నగర నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అనుమతులు హుటాహుటిన వచ్చేస్తాయని ఇదివరకే వార్తలు వచ్చాయి. తాజాగా వస్తున్న వార్తలను బట్టి సోమ, మంగళ వారాల్లో అమరావతి లో నగర నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు అధికారికంగా వెల్లడవుతాయని తెలుస్తోంది.

అయితే ప్రధాని నరేంద్రమోడీ కార్యక్రమ వేదికమీదనుంచి.. ఈ రాజధాని నిర్మాణానికి ఏం వరాలు ప్రకటిస్తారో అని రాష్ట్రం మొత్తం నిరీక్షిస్తోంది. కొందరైతే రాష్ట్రానికి ప్రత్యేకహోదాకు సంబంధించి కూడా సందిగ్ధతకు తెరదించేలా.. మోడీ ఒక విస్పష్టమైన ప్రకటన చేయవచ్చుననే ఆశతో కూడా ఉన్నారు. కనీసం హోదా సంగతి మరచిపోండి.. అంటూ ఆయన ఏం ప్యాకేజీ ఇవ్వదలచుకున్నారో అదైనా వెల్లడిస్తారేమో అని ఆశిస్తున్నారు. అందుకే ఆయన అమరావతికి పర్యావరణ అనుమతులతో సరిపెడతారా.? లేదా, వరాలను కూడా కురిపిస్తారా? అని అంతా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News