టోల్ వసూళ్లు..మోడీ సర్కారు మరో కఠిన నిర్ణయం!

Update: 2019-07-20 04:45 GMT
ఒకవైపు టోల్ చార్జీలు శాశ్వతం అని ఇటీవలే కేంద్రం స్పష్టం చేసింది. చాలా జాతీయ రహదారులు వేయడానికి వెచ్చించిన మొత్తాలు సదరు రహదారులపై ఉన్న టోల్ గేట్ల ద్వారా వసూలు అయినప్పటికీ అక్కడ టోల్ ను రద్దు చేసే ఆలోచన లేదని కేంద్రం తేల్చింది. అలా వసూలు అయిన డబ్బులను మరో చోట రోడ్లు వేయడానికి వాడబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు నితిన్ గడ్కారీ.

అలా టోట్ ఫీజులు శాశ్వతం అని తేల్చిన వెంటనే మరో చర్యకు ఉపక్రమించారు. అదేమిటంటే.. ఇక టోట్ ఫీజులను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. ఇప్పటికే ఫాస్ట్  ట్యాగ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.చాలా టోల్ గేట్ల వద్ద ఒక గేట్ ను ఫాస్ట్ ట్యాగ్ కు కేటాయించారు. ఆ టోల్ గేట్ ద్వారా  ఎంటర్ అయితే ఆన్ లైన్ లో డబ్బులు కట్ అవుతుంది. దానికి గానూ విధిగా అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి.

ఇప్పటికే కొంతమంది దాన్ని వాడుతూ ఉన్నారు. కొత్త కార్లకు ఫాస్ట్ ట్యాగ్ ను జత చేసి ఇస్తున్నారు. పాత కార్లు మాత్రం టోల్ ను డబ్బుల రూపంలో చెల్లించే గేట్ల ద్వారా వెళ్తుంటాయి. అయితే టోల్ చార్జీ కోసం  కరెన్సీని చెల్లించే పద్ధతిని త్వరలోనే రద్దు చేయనున్నారట. ఇక పూర్తిగా ఫాస్ట్ ట్యాగ్ పద్ధతినే అమలు చేస్తారట. ఈ ఏడాది డిసెంబర్ నుంచినే ఈ నియమం అమలు కానున్నట్టుగా తెలుస్తోంది.

ఒకవేళ ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోతే వారు రెట్టింపు డబ్బును చెల్లించాల్సి ఉంటుందట! అన్ని గేట్లూ ఫాస్ట్  ట్యాగ్ కు అనుసంధానం అవుతుందని ఇక వ్యవహారం అంతా ఆన్ లైన్ ద్వారానే సాగుతుందని కేంద్రం ప్రకటించింది. మరి ఇప్పటి వరకూ టోల్ గేట్ల వద్ద కొంతమందికి ఉపాధి అయినా దొరికేది. ఇక వారి అవసరం కూడా తీరిపోయేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.


Tags:    

Similar News