అమ్మ మృతి కేసును తిర‌గ‌దోడాల్సిందేన‌ట‌

Update: 2017-06-27 09:51 GMT
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప‌లు వ‌ర్గాల్లో ఇంకా అనుమానాలు కొన‌సాగ‌తున్న‌ట్లే క‌నిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 22వ ఆసుపత్రిలో చేరిన జయలలిత - డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు. దీంతో ఆమె కోసం ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలు - అమ్మ అభిమానులు ఒక్కసారిగా ఖిన్నుల‌య్యారు. 74 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన కాలంలో జయ కోలుకుంటున్నట్లుగా ప్రచారం చేయడం, చికిత్స పొందుతున్నట్లు జయ ఫొటోను బయటపెట్టక పోవడం - ఇన్‌ చార్జ్‌ సీఎం పన్నీర్‌ సెల్వం - ఇన్‌ చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావులను సైతం జయను చూసేందుకు అనుమతించకపోవడం వంటి అంశాలు పలు అనుమానాలకు దారితీశాయి. ఈ విష‌యంలో మొద‌ట అమ్మ అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ అనంత‌రం ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆ విష‌యం మ‌రుగున ప‌డిపోయింది.

అయితే ఎంద‌రిలోనో అమ్మ మ‌ర‌ణం విష‌యంలో ఇంకా సందేహాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు డీఎంకే నేత స్టాలిన్ సంచ‌న‌ల వ్యాఖ్యాలు చేశారు. తాము అధికారంలోకి వస్తే దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై విచారణ చేయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విచార‌ణ‌లో ఒక‌వేళ‌ జ‌యలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని స్టాలిన్ తేల్చిచెప్పారు. అమ్మ మరణం తరువాత నేడు బినామీలు రాజ్యం ఏలుతున్నారని - అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు రేసు గుర్రాల్లా అమ్ముడుపోయారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, ప్రజాదరణతో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

కాగా స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి. జయలలిత మరణంపై విచారణ జరిపించాలని ఇప్పటికే పలువురు డిమాండ్‌ చేయగా, ఇప్పుడు స్టాలిన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం ఏమిట‌ని ప‌లువురు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News