పాక్ లో భారీ పేలుడు..70 మందికి గాయాలు - ఏడుగురు మృతి!

Update: 2020-10-26 19:10 GMT
దాయాది పాకిస్థాన్ లోని పెషావర్ లో భారీ బాంబు బ్లాస్ట్ జరిగింది. పెషావర్ లో గల ఓ మదర్సా వద్ద మంగళవారం ఉదయం ఈ బాంబ్ పేలింది. ఈ ఘటనలో అక్కడిక్కడే 7 మంది మృతి చెందారు. అలాగే మరో 70 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచిన శక్తిమంతమైన పేలుడు పదార్థాలు పేలిపోయినట్టు వారు చెప్పారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. పాకిస్తాన్ పెషావర్ నగరంలోని దిర్ కాలనీలోని మదర్సాలో పిల్లలకు ఖురాన్ బోధిస్తున్న సమయంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 70 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసు సిబ్బంది.. గాయపడిన పిల్లలను సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్ కి తరలించారు. మరో 20 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పాక్ వైద్యులు వెల్లడించారు.

అయితే.. ఐఈడీతో ప్రార్థనమందిరంలో పేలుడుకు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు ఘటనాస్థలానికి సంబంధించిన మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు గల ఆధారాలను సేకరిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్ లో సుమారు 5 కేజీల పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే కారణమని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహిస్తుండగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించిఉన్నప్పటికీ ఈ ఘటన జరిగింది. దీనితో ప్రస్తుతం అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
Tags:    

Similar News