రాహుల్ చేసిన పనికి మన్మోహన్ రాజీనామా చేయాలనుకున్నారట

Update: 2020-02-17 05:00 GMT
రెండు టర్మ్ లు.. మొత్తంగా పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్.. పలు సందర్భాల్లో తన పదవికి రాజీనామా చేయాలని భావించారా? అంటే అవుననే మాట వస్తుంది. అయితే.. ఏయే సందర్భాల్లో అన్నంతనే సమాధారం చెప్పలేని పరిస్థితి. అందుకు భిన్నంగా తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే వ్యక్తుల్లో ఒకరైన మాంటెక్ సింగ్ అహ్లువాలియా రాసిన పుస్తకంలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి.

బ్యాక్ స్టేజ్: ది స్టోరీ బిహైండ్ ఇండియాస్ హై గ్రోత్ ఇయర్స్ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారీ మాజీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు. అప్పట్లో పవర్ ఫుల్ పోస్టులో ఉన్న ఆయన.. తాజాగా తాను రాసిన పుస్తకంలో ప్రధాని మన్మోహన్ పలు సందర్భాల్లో తన పదవికి రాజీనామా చేయాలన్న ఉద్దేశాన్ని తన వద్ద ప్రస్తావించినట్లుగా పేర్కొన్నారు.

దోషులుగా నిర్థారించిన ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు వీలుగా 2013లో నాటి యూపీఏ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘నాన్ సెన్స్’ అంటూ చించివేయటం పెను సంచలనం గా మారింది. మన్మోహన్ ను పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో రాహుల్ కు పదవిని కట్టబెట్టనున్నారా? అన్న ప్రచారం కూడా సాగింది.

ఈ ఉదంతం గురించి తన పుస్తకంలో మాంటెక్ సింగ్ చెబుతూ.. ఆ సమయంలో ప్రధానిగా వ్యవహరిస్తున్న మన్మోహన్ హర్ట్ అయ్యారని.. తన పదవికి రాజీనామా చేయాలని భావించినట్లు స్పష్టం చేశారు. పథకాల రూపకల్పనకు సంబంధించిన ఒక సమావేశంలో.. తన మీద సాగుతున్న దుమారం గురించి ప్రస్తావించి.. తాను తన పదవికి రాజీనామా చేయాలా? అని తనను అడిగినట్లు గా పేర్కొన్నారు.

ఆర్డినెన్స్ ఎపిసోడ్ లోనే తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన సోదరుడు కమ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజీవ్ అహ్లూవాలియా ఒక వ్యాసాన్ని రాశారని.. దాన్ని ప్రధాని మన్మోహన్ కు చూపించాలని తనను కోరినట్లు వెల్లడించారు. దీనికి తగ్గట్లే తాను ఆ వ్యాసాన్ని మన్మోహన్ కు చూపించగా.. దాన్ని చదివిన ఆయన.. నేను రాజీనామా చేస్తే మంచిదా? అన్న ప్రశ్నను తనకు వేసినట్లు పేర్కొన్నారు. అయితే.. తాను మాత్రం రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మన్మోహన్ తో చెప్పినట్లుగా పేర్కొన్నారు. పలు ఆసక్తికర ఉదంతాలతో సదరు పుస్తకం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News