కరోనా పై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ ..ఎక్కడంటే !

Update: 2020-04-16 08:50 GMT
కరోనా మహమ్మారి ..దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది. దీన్ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. పోలీసులు , డాక్టర్లు , సంబంధిత సిబ్బంది ... ప్రాణాలని పనంగా పెట్టిమరీ కరోనాను అరికట్టడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే , కొందరు అరచేతిలో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకొచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.

దీనిపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో కరోనా పై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో అతని ఫొటో పెట్టడం, మరికొందరు ఓ కాలనీలో ఐదు పాజిటివ్‌ కేసులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేయడం కచ్చితంగా నేరం కిందకే వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అలాంటి వాళ్లపై ఐపీసీ సెక్షన్‌ 153, 188, 505, 269లతో పాటు ఐపీసీ సెక్షన్‌ 10 (2),(1) ఆఫ్‌ ద డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ యాక్ట్‌–2005, సెక్షన్‌ 66 ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు.

ఈ కేసుల్లో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలుశిక్ష పడుతుంది. కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారంటూ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.విష్ణువర్ధన్‌ రెడ్డి   తన ఫేస్‌ బుక్, ట్విటర్‌ ఖాతాల్లో తప్పుడు పోస్టులు చేశాడు. వాట్సాప్‌ ద్వారా పలువురికి పంపాడు. కాణిపాకం ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.  ఈ నేపథ్యంలో వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియా లో వచ్చే వార్తలన్నింటినీ నమ్మొద్దు అని , వచ్చిన వార్తలని  ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకున్న తర్వాత నిజాన్ని నమ్మండి అని , అలా కాకుండా మీ మొబైల్ కి  వచ్చిన మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేస్తూపొతే మీకు శిక్ష తప్పదు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News