పీక్స్ కు మల్లారెడ్డి ఓవరాక్షన్: ఆ పోలీసులు రష్మిక ను.. బన్నీ ని తీసుకొస్తారు

Update: 2023-05-28 13:00 GMT
చేతిలో అధికారం ఉంటే తమ కు తోచినట్లుగా వ్యవహరించే నేతలు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి. కామెడీ గా మాట్లాడినట్లుగా కనిపిస్తారు కానీ.. ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ విమర్శలకు కారణమవుతుంటాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఎలా సాగాలన్న దాని పై మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో.. మంత్రి మల్లారెడ్డి .. ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి పోలీసుల ఉన్నతాధికారుల ను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ''పోలీసు శాఖ నిర్వహించే తెలంగాణ రన్ లో హీరో హీరోయిన్ల ను తీసుకొచ్చి డ్యాన్సులు చేయిస్తాం. ఒక డీసీపీ రష్మిక మందాన్న ను.. మరో డీసీపీ హీరో అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్ లను తీసుకొస్తారు'' అంటూ చేసిన వ్యాఖ్యలు విన్నవారు విస్మయానికి గురయ్యారు.

ఎంత మంత్రి అయితే మాత్రం ఇలా మాట్లాడటమా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ కి చెందిన అంకుషాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు శోభ.. ఘట్ కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయని కారణంగా రైతు లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని.. రైతు సమస్యల్ని పరిష్కరించకుండా హీరో హీరోయిన్లతో డ్యాన్సులేందంటే మంత్రిని నిలదీశారు. దీంతో.. చిరాకు పడ్డ మంత్రి మల్లారెడ్డి.. 'ఆమె ను బయట కు తీసుకుపోండి' అంటూ ఆదేశించటం.

ఆ వెంటనే వెనుకా ముందు చూసుకోకుండా శోభ ను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు మాత్రం కిమ్మనకుండా ఉండిపోవటం గమనార్హం. ఈ వ్యవహారం పై సొంత పార్టీ నేతలు సైతం మంత్రి మల్లారెడ్డి తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయితే.. ఆ వ్యాఖ్యల్ని తమ ప్రైవేటు సంభాషణలకే పరిమితం చేయటం గమనార్హం.

Similar News