'ఇడ్లీ అమ్మ‌'కు ఆనంద్ మహీంద్రా 'నీడ‌'!

Update: 2021-04-02 13:30 GMT
ఇవాళ ఎక్కడ చూసినా.. ప్లేట్ ఇడ్లీ ధ‌ర క‌నీసం రూ.20 ఉంటుంది. కానీ.. రూపాయికే ఇడ్లీ విక్ర‌యిస్తే..? అవును.. కేవ‌లం రూపాయికే ఇడ్లీ అమ్ముతూ నిరుపేద‌ల ఆక‌లి తీరుస్తున్నారు తమిళనాడుకు చెందిన కమలాథల్. అయితే.. ఆమె ఎంత‌ ధ‌న‌వంతురాలో అనుకుంటే పొర‌పాటే. ఆమె నిరుపేద‌. క‌నీసం వంట వండుకోవ‌డానికి గ్యాస్ పొయ్యి కూడా లేని పేద‌రాలు. క‌ట్టెల పొయ్యి మీద‌నే ఇడ్లీ వండి రూపాయికి అమ్ముతున్నారు.

త‌న సేవా దృక్ప‌థంతో 'ఇడ్లీ అమ్మ‌'గా గుర్తింపు పొందారు. ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో, ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలోనూ ఇడ్లీ అమ్మ‌పై క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో క‌మ‌లాథ‌ల్ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగింది.  ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా.. ఆమెకు స‌హ‌కారం అందించ‌డానికి ముందుకు వ‌చ్చారు.

ఆమెకు వంట గ్యాస్ అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే.. భార‌త్ గ్యాస్ వారు ఆమెకు సిలిండ‌ర్ అంద‌జేశారు. దీంతో.. ఇడ్లీ అమ్మ‌కు ఇల్లు లేదా హోట‌ల్ నిర్మించి ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు ఆనంద్‌. ఆ త‌ర్వాత అంద‌రూ ఈ విష‌యం గురించి మ‌రిచిపోయారు. కానీ.. ఆనంద్ మ‌హీంద్రా మాత్రం ఆ ప‌నిలో సీరియ‌స్ గా ఉన్నారు.

ఇంటి అనుమ‌తి కోసం అధికారులకు ద‌ర‌ఖాస్తు చేయ‌డం.. దానికి అనుమ‌తులు మంజూరు కావ‌డం జ‌రిగిపోయాయి. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించారు మ‌హీంద్రా. క‌మ‌లాథ‌ల్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని, త్వ‌ర‌లోనే ఇంటి నిర్మాణం మొద‌ల‌వుతుంద‌ని తెలిపారు. తొండముత్తూరులో మ‌హేంద్ర‌ లైఫ్ స్పేసెస్ సంస్థ ఆ ఇంటి నిర్మించ‌నుంది.
Tags:    

Similar News