కాంగ్రెస్ కి రాహుల్ వద్దా....ఇదేమి ధోరణి ?
తాజాగా ప్రియాంకా గాంధీని ఆమె నాన్నమ్మ ఇందిరాగాంధీతో పోలుస్తూ ఒక కాంగ్రెస్ ఎంపీ ఆకాశానికి ఎత్తేశారు. దేశానికి ప్రధానిగా ప్రియాంకా గాంధీని ఎన్నుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చెప్పడం ఇపుడు సంచలనం రేపుతోంది.;
కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలైందా... ఆ పార్టీకి ఒకసారి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీలో ఎంపీలలలోనూ వేరే విధమైన ఆలోచనలు ఉన్నాయా అన్నదే బిగ్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చడం లేదా అన్నది కొత్తగా ఉన్న పాయింటే మరి.
ప్రియాంక కోసం :
ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అయి కేవలం ఏడాది మాత్రమే గడచింది. ఆమె రాహుల్ గాంధీ వదిలేసిన వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో కొత్తగా అడుగుపెట్టారు. రాహుల్ గాంధీ విషయం తీసుకుంటే ఆయన 2004 నుంచి ఈ రోజు దాకా అంటే 22 ఏళ్ళుగా ఎంపీగా ఉన్నారు. కీలకమైన పార్టీ పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కనుక రేపటి ఎన్నికల్లో గెలిస్తే ఆయనే ప్రధాని అన్నట్లుగా అంతటా ప్రచారంలో ఉన్న నేపధ్యంలో సొంత పార్టీలోనే కొందరు ఎంపీలు ప్రియాంక ప్రధాని కావాలంటూ స్లోగన్స్ వినిపించడం వెనక ఉన్న కారణాలు ఏమిటి అన్నది పార్టీలోనూ విస్తృతంగా చర్చించాల్సి ఉందని అంటున్నారు.
డేరింగ్ లీడర్ అంటూ :
తాజాగా ప్రియాంకా గాంధీని ఆమె నాన్నమ్మ ఇందిరాగాంధీతో పోలుస్తూ ఒక కాంగ్రెస్ ఎంపీ ఆకాశానికి ఎత్తేశారు. దేశానికి ప్రధానిగా ప్రియాంకా గాంధీని ఎన్నుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చెప్పడం ఇపుడు సంచలనం రేపుతోంది. ఆమెను కనుక ప్రధాని చేస్తే ఇందిరమ్మ అంత గ్లామర్ ఆమెకు కూడా ఉంటుందని అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఆమె ఉంటారని కూడా ఆయన చెప్పడం విశేషం. ఆమె ప్రధాని అయితేనే బంగ్లాదేశ్ లాంటి వాటితో పాటు శత్రు దేశాలకు తగిన విధంగా జవాబు చెబుతారు అని ఆయన అనడం గమనార్హం. మరి రాహుల్ గాంధీ సంగతేంటి అంటే రాహుల్ ప్రియాంకా కలసి పనిచేస్తారు అని చెప్పుకొచ్చారు. అంటే ప్రియాంకానే ప్రధానిగా చేయడానికి రాహుల్ సైతం పనిచేయాలన్నది కాంగ్రెస్ లో ఎంపీల మాటగా ఉందా అన్న చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ ఫేస్ గా :
రాహుల్ గాంధీతో గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. అయితే అవేమీ వర్కౌట్ కావడం లేదు, పైగా వరసబెట్టి ఎన్నికల్లో పరాజయాలను మూటకట్టుకోవాల్సి వస్తోంది. దాంతో కొత్త ఫేస్ గా లేడీ ఫేస్ గా మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ పోలికలు ఉన్న ఫేస్ గా ప్రియాంకాను కాంగ్రెస్ తమ నాయకురాలిగా ముందుకు తెస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయన్న భావన అయితే కాంగ్రెస్ నాయకులలో ఎక్కువ మందిలో కనిపిస్తోంది అని అంటున్నారు.
ఆ డిమాండ్లు ఉన్నాయి :
ఇక ప్రియాంకా గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రా కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. అవును నేను కూడా చాలా చోట్ల ఈ తరహా డిమాండ్లు రావడం విన్నాను అని ఆయన చెప్పారు. తన సతీమణి ప్రధాని కావాలని అంతా కోరుకుంటున్నారు అని చెప్పారు. అయితే ప్రియాంక గాంధీ ప్రజా సమస్యల మీదనే ప్రస్తుతం దృష్టి పెట్టి ఉంచారని ఆయన చెప్పారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ లో అగ్ర నేత అయిన సోనియా గాంధీ దీని మీద ఏమి ఆలోచిస్తున్నారో అన్నది చాలా కీలకంగా ఉంటుంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.