రూ.70 లక్షల కోట్లు ఉన్న వ్యక్తి 'డబ్బు' గురించి చెప్పిన మాట వైరల్!
దీంతో.. ఆయన చెబుతున్నట్లు రోజుకు 18 గంటలకు పైగా పని చేయడం, నిరంతర ప్రయాణాలు, భారీ ప్రాజెక్టుల బాధ్యతలు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.;
మనిషికి డబ్బు చాలా ముఖ్యమనే సంగతి తెలిసిందే. మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ వంటి వాటి దగ్గర నుంచి లగ్జరీ లైఫ్, ఏదనుకుంటే అది చేయగల సమర్థత డబ్బు వల్లే వస్తుంది. అందుకే మనిషి నిత్యం దానివెంట పరుగెడుతుంటాడని అంటారు. దీనికోసం గడ్డి కరిచేవాళ్లు, తప్పుడు పనులు చేసేవాళ్లకూ నేటి సమాజంలో కొదవ లేదని చెబుతారు. ఈ క్రమంలో అపర కుభేరుడు ఎలాన్ మస్క్ చెప్పిన ఓ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవును... ఈ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుందనే సంగతి తెలిసిందే! డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరావుగారంటారు.. ధనముంటే అప్పలమ్మని అప్సరస అని పొగిడేస్తారు అని తెలుగు సినీకవులు చెప్పకనే చెప్పారు. ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్.. సంపదకు, సంతోషానికి మధ్య ఉన్న సున్నితమైన గీతను గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
"డబ్బు ఆనందాన్ని కొనుగోలు చేయదు అని ఎవరైతే తొలుత అన్నారో.. ఆ రచయితకు తను ఏమి చెబుతున్నది నిజంగానే తెలుసు" చెబుతూ ఈ వాక్యం చివరలో ఒక విచారకరమైన ఎమోజీని యాడ్ చేశారు మస్క్. ఈ నేపథ్యంలో అపారమైన సంపద ఉన్న వ్యక్తి నుండి ఇలాంటి మాటలు రావడంతో ఇటు సామాన్యులు, అటు ఆర్థికవేత్తలు ఆశ్చర్యపోతున్నారని చెప్పొచ్చు.
దీంతో.. ఆయన చెబుతున్నట్లు రోజుకు 18 గంటలకు పైగా పని చేయడం, నిరంతర ప్రయాణాలు, భారీ ప్రాజెక్టుల బాధ్యతలు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఘన విజయం సాధించిన వ్యక్తి.. తన వ్యక్తిగత జీవితంలో శాంతి కోసం పరితపిస్తున్నట్లు తాజా పోస్టు స్పష్టం చేస్తుందని.. ఇందులో వేధాంతం ఉందనుకున్నా తప్పు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నెటిజన్ల రకరాకాల రియాక్షన్స్!:
సుమారు 23.4 కోట్ల మంది ట్విట్టర్ (ఎక్స్) ఫాలోవర్స్ కలిగి ఉన్న ఎలాన్ మస్క్ చేసిన పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారింది.ఈ సందర్భంగా స్పందించిన నెటిజన్లలో.. కడుపు నిండిన వారి కబుర్లు వేధాంత ధోరణిలోనే ఉంటాయని ఒకరంటే.. సకాలంలో అద్దె చెల్లించగలిగే స్తోమత ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం సులభం అని మరొకరు.. నీ దగ్గర ఉన్న డబ్బు మాకు ఇవ్వు అని ఇంకొకరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా... మస్క్ ట్వీట్ కచ్చితంగా ఆలోచించదగినదే అని మరికొంతమంది స్పందిస్తున్నారు.