ఏపీ భవిష్యత్తుకు పునాది.. దక్షిణాసియాలోనే తొలి క్వాంటం వ్యాలీకి భూమి పూజ

అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు రాష్ట్రానికే కాకుండా దేశానికి మైలురాయిగా నిలుస్తోందని అంటున్నారు. దేశంలో తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు.;

Update: 2026-02-07 12:45 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి క్వాంటం వ్యాలీకి శనివారం భూమి పూజ జరిగింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో సీఆర్డీఏ కేటాయించిన 50 ఎకరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి క్వాంటం వ్యాలీ దేశంలోనే కాకుండా దక్షిణాసియాలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనిద్వారా ప్రపంచంలోని ఐదు అత్యున్నత క్వాంటం సెంటర్లలో అమరావతి ఒకటిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు రాష్ట్రానికే కాకుండా దేశానికి మైలురాయిగా నిలుస్తోందని అంటున్నారు. దేశంలో తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ క్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, ఉత్పత్తులు, నైపుణ్యాభివృద్ధికి అమరావతిలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

చంద్రబాబు 4.0 ప్రభుత్వం వచ్చీరాగానే ఈ కొత్త టెక్నాలజీపైనే ఫోకస్ చేసింది. ఈ రోజు శంకుస్థాపన కూడా పూర్తయింది. అసలు ఏంటీ క్వాంటం..? దీనివల్ల ఏపీకి కలిగే ప్రయోజనం ఏంటన్న దానిపై ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతోంది. టెక్ నిపుణులకు తప్ప సామాన్యులకు అర్థం కాని, అసలు తెలియని క్వాంటం కంప్యూటర్ రానున్న రోజుల్లో ఏపీ దశ, దిశ మార్చబోతోందన్న ప్రచారం అందరిలో ఆసక్తి రేపుతోంది. ఒక్క ఏపీనే కాదు క్వాంటం కంప్యూటింగ్ తో రాబోయే కాలంలో ప్రపంచ సాంకేతిక గమనమే మారబోతోందన్న అంచనాలు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

క్వాంటంతో వేగం..

సాధారణ కంప్యూటర్లు సమాచారాన్ని 'బిట్స్' రూపంలో ప్రాసెస్ చేస్తాయి. కానీ క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్ ఉపయోగిస్తాయి. ఒక క్యూబిట్ అనేది ఒకే సమయంలో 0 మరియు 1 రెండూగా ఉండగలదు. దీనివల్ల సాధారణ కంప్యూటర్లు ఏళ్ళ తరబడి చేసే గణనలను ఇవి కేవలం సెకన్లలోనే పూర్తి చేయగలవు. ఇక రెండు క్యూబిట్లు ఎంత దూరంలో ఉన్నా ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి. దీనివల్ల సమాచార మార్పిడి వేగం అనూహ్యంగా పెరుగుతుంది. ముఖ్యంగా క్వాంటం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరగనుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న హ్యాకింగ్ పద్ధతులు క్వాంటం సెక్యూరిటీ ముందు పని చేయవు. సమాచారం అత్యంత సురక్షితంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులకు కొత్త మందులను కనుగొనడం వ్యాక్సిన్ల తయారీలో సంక్లిష్టమైన విశ్లేషణలను క్వాంటం కంప్యూటర్ చేయగలదు. ఇక ప్రకృతి వైపరీత్యాలను, వాతావరణ మార్పులను అత్యంత కచ్చితత్వంతో ముందుగానే ఊహించవచ్చు. ప్రజలకు జరిగే నష్టాన్ని బాగా తగ్గించవచ్చు. ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ విశ్లేషణలు, ఫైనాన్షియల్ మోడలింగ్, డేటా ప్రాసెసింగ్ వంటి ఆర్థికాంశాలు మెరుగుపడతాయి. ఇదే సమయంలో క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తే అమరావతి పేరు ప్రపంచ పటంలో నిలుస్తుంది.

గ్లోబల్ హబ్ గా అమరావతి

మన రాజధాని గ్లోబల్ హబ్ గా తయారువుతుంది. బోస్టన్, మ్యూనిచ్, సింగపూర్ వంటి మహా నగరాల సరసన అమరావతి చేరుతుంది. వేల సంఖ్యలో హై-వాల్యూ టెక్ ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం క్వాంటం టెక్నాలజీకి తోడైతే ఊహించని వేగంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.



Tags:    

Similar News