టీటీడీపీకి షాకిచ్చిన స్పీక‌ర్ నిర్ణ‌యం

Update: 2016-07-08 07:57 GMT
తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు కేటాయించిన గదులపై వివాదంలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. టీడీపీఎల్పీకి కేటాయించిన గదులను తగినంత సభ్యులు లేరన్న కారణంతో వాటిని అసెంబ్లీ వేరేవారికి కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నిర్ణ‌యంలో గ‌తంలో టీడీపీ అనుస‌రించిన విధానాన్నే ఇపుడు తెలంగాణ రాష్ట్ర స్పీక‌ర్ మధుసూదనాచారి కొన‌సాగిస్తుండ‌టం అది టీటీడీపీకి ఇబ్బందిక‌రంగా మార‌టం విశేషం.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున‌ పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో పన్నెండుమంది టీఆర్‌ ఎస్‌ లో చేరిపోవ‌డమే కాకుండా తమ సభ్యత్వాన్ని టీఆర్‌ ఎస్‌ పార్టీలోకి మార్పు చేసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే టీడీపీలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఐదుగురు ఎమ్మెల్యేలున్న పార్టీకి మాత్రమే అసెంబ్లీలో గదిని కేటాయిస్తారు. ఈ విధానాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆనాటి టీడీపీ ప్రభుత్వం తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. అప్పటి స్పీకర్‌ యనమల రామకృష్ణుడు దీనిని అమలు చేశారు. ఆ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వర్తింపజేసినట్టు టీఆర్‌ ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలవుతుందని ప్రతిపక్షనేతలు - రాజకీయ విశ్లేషణలు ప్రశ్నిస్తున్నారు.

295 మంది ఎమ్మెల్యేలున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఐదుగురు సభ్యులు ఉండాలన్న నిబంధన సరిపోతుందని - కానీ 120 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలు చేయడం వీలవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలున్నా ఆ పార్టీకి గదిని కేటాయించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం విధానమే అమలైతే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీకి టీడీపి పరిస్థితే పునరావృతం అవుతుందని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలే లేకుండా చేయాలన్న అధికార టీఆర్‌ ఎస్ పార్టీ వైఖరి సరికాదని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తొందరపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభంలోనే టీడీపీకి గదులు కేటాయింపుపై వివాదం చెలరేగింది. తర్వాత సమసిపోయినప్ప‌టికీ మళ్లీ ఆ వివాదం మొదటికొచ్చింది. సమాచారం లేకుండా - వెనక్కు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పకుండా ఏ రకంగా తమకు కేటాయించిన గదులను రద్దు చేస్తారని టీడీపీ తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్పీకర్‌ మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయాన్ని ఇతర ప్రతిపక్షపార్టీలు కూడా వ్యతిరేకించాయి. స్పీకర్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేందని అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News