తాత పేరుతో జ‌నంలోకి లోకేష్‌!

Update: 2021-09-03 01:30 GMT
తెలుగు దేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారం చేప‌ట్టిన దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు అప్ప‌ట్లో చ‌రిత్ర సృష్టించారు. త‌న న‌ట‌న‌తో తెలుగు వాళ్ల హృద‌యాల‌ను గెలుచుకున్న ఆయ‌న‌.. ఆ అభిమానాన్ని ఓట్లుగా మ‌లుచుకోగ‌లిగారు. త‌న పాల‌న‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టి గొప్ప నాయ‌కుడిగా ఎదిగారు. ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిణామాల‌తో ఆయ‌న గ‌ద్దెదిగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అల్లుడిగా ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల్లో అంత‌టి అభిమానాన్ని తెచ్చుకోలేక‌పోయారు. ఇప్ప‌టికీ అదే ప‌రిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు త‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో వేగం పెంచిన చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌.. త‌న తండ్రిని కాకుండా తాత పేరుతోనే జ‌నంలోకి వెళ్లాల‌ని చూస్తున్నట్లు స‌మాచారం.

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు వ్య‌క్తిగ‌త అభిమానులు త‌క్కువే. తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడిగానే ఆయ‌న‌కు గొప్ప పేరుంది. ఏవో పొత్తులు పెట్టుకుని ఆయ‌న ఇక్క‌డివ‌ర‌కూ బండిని లాక్కొచ్చారు. కానీ దివంగ‌త ఎన్టీఆర్‌లా బాబు స్వ‌యం ప్ర‌కాశం కాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పైగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచార‌నే ముద్ర ఎలాగో ఉంది. దీంతో త‌న తండ్రి పేరును వాడుకుని ముందుకు సాగిన లోకేష్‌ ప్ర‌యాణం ఇప్ప‌టివ‌ర‌కూ గొప్ప‌గా సాగింది లేదు. బాబు హ‌యాంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రి ప‌ద‌వి పొందిన ఆయ‌న‌.. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి చ‌వి చూశారు. దీంతో ఇప్పుడిక తాతా పేరును వాడుకునేందుకు సిద్ధ‌మైపోయార‌నే టాక్ వినిపిస్తోంది. జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం నినాదాల‌తో ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్ బాట‌లో న‌డిచేందుకు లోకేష్‌ సిద్ధ‌మ‌వుతున్నారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం ఓదార్పు యాత్ర‌లు చేప్ప‌టిన జ‌గ‌న్ ఎక్క‌డిక‌క్క‌డ వైఎస్ విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రిస్తూ వెళ్లారు. జ‌నంలో ఉంటూ నాయ‌క‌త్వాన్ని పెంపొందించుకున్నారు. పాద‌యాత్ర‌తో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు లోకేష్‌ కూడా ఇదే ఫాలో కాబోతున్నారు. ఏపీలోని ప‌ద‌మూడు జిల్లాల్లోని ప్ర‌తి గ్రామంలో త‌న తాత ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డంతో పాటు వాటిని ఆవిష్క‌రించ‌డం ద్వారా తాతాకు తానే అస‌లైన రాజ‌కీయ వార‌సుడిగా అని చాటిచెప్పుకోవాల‌నే ప్ర‌ణాళిక‌లో ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు.  ఆ దిశగా లోకేశ్ ఇప్ప‌టికే ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌ని స‌మాచారం. ఈ విధంగా తెలుగు దేశం త‌మ్ముళ్ల‌ను చైత‌న్య‌ప‌రిచి త‌న నాయ‌క‌త్వాన్ని ఆమోదించేలా చేసుకోవ‌డం లోకేష్‌ మాస్ట‌ర్ ప్లాన్‌గా తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడ‌నే కార‌ణంతో ఆయ‌న అభిమానులు చంద్ర‌బాబు వైపు మొగ్గుచూప‌లేదు. ఇప్పుడిక ఆయ‌న కొడుకు లోకేష్ వైపు మ‌ళ్లుతారా? లేదా అన్న‌ది సందేహంగా మారింది. మ‌రోవైపు ఎన్టీఆర్ మ‌న‌వ‌డు అంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరే ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. మ‌రి కూతురు కొడుక‌నే సెంటిమెంట్ లోకేష్‌కు క‌లిసొస్తుందా? అంటే క‌చ్చితంగా అవున‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఈ విగ్ర‌హాల రాజ‌కీయాల‌తో లోకేష్‌ గొప్ప నాయ‌కుడు కాలేడ‌ని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే దృష్టి పెడితేనే మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News