ప‌వ‌న్ బాట‌లో లోకేష్‌!

Update: 2021-10-21 02:30 GMT
ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానం.. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభవం ఉన్న చంద్ర‌బాబు నాయుడి వార‌సుడిగా రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన నారా లోకేష్ త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోతున్నార‌నే అభిప్రాయం ఇప్ప‌టికీ జ‌నాల్లో ఉంది. బాబు హ‌యాంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిన ఈ చిన‌బాబు.. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి చ‌వి చూశారు. మాట‌ల్లో స్ప‌ష్ట‌త‌.. విషయాల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకున్నారు. కానీ కొంత కాలంగా దూకుడు పెంచిన లోకేష్ ప్ర‌జ‌ల్లోకి వ‌స్తూ స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. గ‌తంలో లాగా కేవ‌లం ట్విట్ట‌ర్‌కే ప‌రిమితం కాకుండా జ‌నాల్లోకి వ‌చ్చి హ‌డావుడి చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌ను భ‌విష్య‌త్‌ నాయ‌కుడిగా చూడాల‌న్న త‌న తండ్రి చంద్ర‌బాబు క‌ల‌ను నెర‌వేర్చే దిశ‌గా అత‌ను సాగుతున్నాడ‌ని అనిపించింది. కానీ ఇప్పుడు లోకేష్ వ్య‌వ‌హ‌ర శైలి విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఆవేశం వ‌చ్చిన‌పుడు ప్ర‌జ‌ల్లోకి రావ‌డం.. ఆ త‌ర్వాత పూర్తిగా ట్విట్ట‌ర్‌కే ప‌రిమితం కావ‌డంతో ఇప్పుడు లోకేష్‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పోలుస్తున్నారు. ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ త‌న‌కు మూడుంట‌నే ప‌డికిలి బిగించి రోడ్డుపైకి వ‌స్తార‌ని ఆ వేడి చ‌ల్లారితే వెళ్లి మ‌ళ్లీ సినిమాలు చేసుకుంటార‌నే అభిప్రాయాలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ప‌వ‌న్‌ను ఎవ‌రూ సిరీయ‌స్ పొలిటిషియ‌న్‌గా కాకుండా.. సీజ‌న‌ల్ పొలిటీషియ‌న్‌గా మాత్ర‌మే చూస్తున్నార‌నే టాక్ ఉంది.

ఇప్పుడు లోకేష్ కూడా ప‌వ‌న్ బాట‌లోనే సాగుతున్నారా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఆవేశం ఉన్న‌పుడు జ‌నాల్లోకి రావ‌డం అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ప‌రామ‌ర్శ‌ల పేరుతో హ‌డావుడి చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు అయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా క‌రెంటు చార్టీల పెంపు అంటూ సీఎంకు లేఖాస్త్రాలు సంధించి మ‌ళ్లీ నిశ్శ‌బ్దమైపోయారు. ఇప్పుడు టీడీపీ కార్యాల‌యాల మీద దాడుల‌పై ఘాటుగానే స్పందించిన ఆయ‌న‌.. ఇంకో రెండు రోజులైతే మ‌ళ్లీ క‌నిపించ‌ర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  మ‌రోవైపు పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింది. సంప్ర‌దాయం పేరుతో బ‌ద్వేలు ఉప ఎన్నిక నుంచి టీడీపీ త‌ప్పుకుంది.

ఈ నేప‌థ్యంలో లోకేష్ ఒక‌టి రెండు సార్లు జ‌నాల్లోకి వ‌చ్చి హ‌డావుడి చేసినా పెద్ద‌గా ప్ర‌యోజనం ఉండ‌డం లేద‌ని తెలుసుకున్న‌ట్లు ఉన్నారు. మ‌రోవైపు సీనియ‌ర్ నాయ‌కులంతా క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న తండ్రినే ర‌థ‌సార‌థిగా పెట్టి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. దీంతో లోకేష్‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. తండ్రి వ్యూహాలు ఎలాంటివో లోకేష్ అర్థం చేసుకోలేక‌పోతున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ వేసే ఎత్తులు ప‌సిగ‌ట్టే సామ‌ర్థ్యం ఇంకా లోకేష్‌కు రాలేద‌ని జ‌నాలు అనుకుంటున్నారు. దీంతో లోకేష్ సైలెంట్ అయిపోయారు. ఆవేశం వ‌చ్చిన‌పుడు జ‌నాల్లోకి వ‌చ్చి.. మ‌ళ్లీ రెస్ట్ తీసుకుంటున్నార‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News