వ్యాక్సిన్​ కోసం కలిసినడుద్దాం.. మోదీకి చైనా అధ్యక్షుడి ప్రపోజల్!

Update: 2020-11-18 06:45 GMT
కరోనా వైరస్​కు పుట్టింది చైనాలోనేనని.. ఈ వైరస్​ను ఆ దేశమే ప్రపంచదేశాలకు తగిలించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మరోవైపు చైనా.. భారత్​ సరిహద్దుల్లోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ నేపథ్యంలో చైనా భారత్​కు ఓ కీలక ప్రతిపాదన చేసింది. కరోనా వ్యాక్సిన్​కోసం కలసి పనిచేద్దాంటూ ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్​.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించాడు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో  ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకున్నది.

పింగ్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే గనుక దేశాల మధ్య భాగస్వామ్యంతో రూపొందనున్న తొలి వ్యాక్సిన్ తయారుకానుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమి 12వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం ఐదు దేశాల అధినేతలు బొల్సనారో, పుతిన్, మోదీ, జిన్ పింగ్, సిరిల్ రమఫొసాలు తమ సందేశాలను వినిపించారు.

‘కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్లు కనిపెట్టే ప్రయత్నాల్లో భాగంగా చైనాకు చెందిన పలు కంపెనీలు.. రష్యా, బ్రెజిల్ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. అయితే దేశాధినేతలుగా మనం కూడా ఈ విషయంపై చర్చించాలి.  బ్రిక్స్ దేశాల సారథ్యంలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి నేను ప్రతిపాదన చేస్తున్నాను. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సింఫోజియంను ఏర్పాటు చేయడం ద్వారా సంప్రదాయ ఔషధాలతో వైరస్ ను కట్టడిచేసే మార్గాలను అణ్వేషిస్తే మంచిదని ప్రతిపాదిస్తున్నాను.

 ఈ రెండు ప్రతిపాదనలకు భారత్ సహకారం ఎంతో కీలకమైనది. అదే సమయంలో బ్రిక్స్ దేశాలన్నీ ఈ దిశగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను''అని జిన్ పింగ్ అన్నారు.బ్రిక్స్ దేశాలన్నీ కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి అంగీకరిస్తే గనుక.. చైనాలోని జియామెన్‌ నగరంలోని ఆవిష్కరణ కేంద్రంలో సంబంధిత రీసెర్చ్ కోసం చైనా జాతీయ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామని జిన్ పింగ్ చెప్పారు. మనకు ఉన్న విబేధాలను పక్కనపెట్టి వ్యాక్సిన్​ కోసం కలిసి పనిచేయాలంటూ జిన్​పింగ్ పేర్కొన్నారు. అయితే భారత్​ చైనా మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుతం తరుణంలో చైనా అధినేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Tags:    

Similar News