మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు ... మంత్రి ఏంచెప్తున్నారంటే !

Update: 2020-12-09 07:37 GMT
తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది.  ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడనే ఆరోపణలపై దుండిగల్‌ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదైంది. అలాగే తన భూమిని రిజ్రిస్టేషన్‌ చేయించాలంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు చెప్తూ .. మంత్రి మల్లారెడ్డి తో పాటుగా ఆయన కుమారుడు భద్రారెడ్డితో పాటు మరో ఐదుగురు అనుచరులపైనా దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తన తల్లి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని శ్యామలాదేవి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె తెలిపింది. దీనితో వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలోని సర్వేనంబరు 115, 116, 117లో స్థానికంగా ఉండే పొన్నబోయిన శ్యామలాదేవి తల్లి పద్మావతి పేరున 2.13 ఎకరాల భూమి ఉంది. అది మంత్రి మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో ఉంది. ఆ భూమిని తనకు విక్రయించాలని మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. వినకపోవడంతో బెదిరింపులకు దిగారు. అంతేకాదు 20 గుంటల భూమిని కబ్జాచేసి ప్రహరీగోడను నిర్మించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని బాధితురాలు అన్నారు. తన తల్లి పద్మావతితో కలిసి కోర్టులో మల్లారెడ్డిపై భూవివాదానికి సంబంధించిన పిటిషన్‌ వేసేందుకు న్యాయవాది లక్ష్మీనారాయణను ఆశ్రయిస్తే ఆయన కూడా మోసం చేశారు. మంత్రితో చేతులు కలిపిన లాయర్ బాధితులనుంచి స్టాంప్‌ పేపర్‌ పై  సంతకాలు తీసుకున్నారు. అలా నకిలీ అగ్రిమెంట్‌ పేపర్లను తయారు చేశారు. కొన్ని నెలల క్రితమే శ్యామలాదేవి తల్లి పద్మావతి, సోదరి మరణించారు. తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు అని ఆమె తెలిపింది.  

పోలీస్‌ అధికారులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడం లేదంటూ శ్యామలాదేవి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్పందించిన కోర్టు.. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని దుండిగల్‌ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డి (ఏ1), భద్రారెడ్డి (ఏ2), ఎం.రాజు (ఏ3), న్యాయవాది లక్ష్మీనారాయణ (ఏ4), మస్తాన్‌ (ఏ5), పుల్లయ్య (ఏ6), చంద్రయ్య (ఏ7)లతో పాటు మరికొందరిపై ఐపీసీ 447, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద ఈ నెల 6న కేసులు నమోదు చేశారు.  కాగా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్ ‌లో నమోదైన కేసుతో తనకెలాంటి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను భూమిని కబ్జా చేశాననడంలో వాస్తవం లేదు అని తెలిపారు.
Tags:    

Similar News