మంతనాలు మొదలయ్యాయి.. బీ అలర్ట్.. !
ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఒకంత ఇబ్బందికర పరిస్తితిని ఎదుర్కొంటున్నామని స్వయంగా చెబుతున్నారు.;
రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఎవరు ఊహించలేరు. ఈరోజు మిత్రుడుగా ఉన్న నాయకుడు రేపు శత్రువుగా మారొచ్చు. ఈరోజు శత్రువుగా ఉన్న నాయకుడు రేపు మిత్రుడుగా కూడా మారొచ్చు. అవసరం - అవకాశం అనే రెండు పట్టాల మీద నడిచే రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మార్పునైనా సంతరించుకుంటాయి. అలాంటి పరిణామాలే రాష్ట్రంలో తెరచాటున జరుగుతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ.
ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఒకంత ఇబ్బందికర పరిస్తితిని ఎదుర్కొంటున్నామని స్వయంగా చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలు అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాలో కూడా దాదాపు పది నుంచి 12 వరకు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలకు మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలు ఏకంగా రోడ్డు ఎక్కుతున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు.
ప్రభుత్వం పైన పార్టీ పైన విమర్శలు కూడా చేస్తున్నారు. వీరి విషయాన్ని పార్టీ నేతలు కొందరు పట్టించుకుంటున్నారు. మరికొందరు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆధిపత్య రాజకీయాలతో నలిగిపోతున్న కొంతమంది ఎమ్మెల్యేలు తెరచాటున తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు... అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇలాంటి వారు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అది ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న వైసీపీ నే అన్నది బహిరంగ రహస్యం.
ఘర్ వాపసీ మంత్రాన్ని అనుసరిస్తున్న వైసిపి కూడా పోయిన నాయకులను తెచ్చి చేర్చుకునేందుకు సిద్ధంగానే ఉండడం, ప్రస్తుతం అధికార పార్టీల్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు నాయకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఏ క్షణాన ఏమైనా జరగచ్చున్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో రాయలసీమలో నాలుగు నియోజకవర్గాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు నియోజకవర్గాలు, గోదావరి జిల్లాలో రెండు నియోజకవర్గాలు, ఉత్తరాంధ్రలో మూడు నియోజకవర్గాలలో మార్పు తథ్యమని తెలుస్తోంది. ఏం జరుగుతుందనేది చూడాలి.