విశాఖ విశ్వ నగరి...బాబు అల్టిమేట్ కామెంట్
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది.;
విశాఖ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతమైన తీరులో వ్యాఖ్యానించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన మాట్లాడిన బాబు విశాఖను వేయినోళ్ళ పొగుడుతూ ఎన్నో రకాలుగా కితాబులు ఇచ్చారు. విశాఖని ఏకంగా విశ్వ నగరిగా ఆయన అభివర్ణించారు. విశాఖ గ్లోబల్ సిటీగా ఇప్పటికే ఎదిగిందని అన్నారు. ఏయూ వేదికగా మొత్తం 54 దేశాల నుంచి విద్యార్ధులు విద్య కోసం వస్తున్నారు అంటే విశాఖ అంతర్జాతీయంగా రాణిస్తోందనడానికి వేరే ఉదాహరణ అవసరం లేదని అన్నారు. అలాంటి విశాఖకు ఇపుడు సరికొత్త ఆకర్షణగా గ్లోబల్ సిటీకి గ్రోత్ ఇంజన్ గా గూగుల్ డేటా సెంటర్ వస్తోంది అని బాబు చెప్పారు.
మూడున్నర దశాబ్దాలుగా :
దేశంలో ఆర్ధిక సంస్కరణలు అమలు మొదలై మూడున్నర దశాబ్దాలు అవుతోంది. ప్రపంచ పెట్టుబడులు ఎన్నో దేశం నలుమూలకూ తరలి వచ్చాయి. అందులో కళ్ళు చెదిరే నంబర్లు కూడా ఉన్నాయి. అనేక రాష్ట్రాలు పోటీ పడి భారీ ఇన్వెస్టెమెంట్లు తెచ్చాయి. కానీ అవన్నీ ఒక ఎత్తు గూగుల్ డేటా సెంటర్ ఒక ఎత్తు అని బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడులను ఒక మూలకు నెట్టి అతి పెద్ద పెట్టుబడితో విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ఆయన అన్నారు. ఏకంగా లక్ష్న్నర కోట్ల రూపాయల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు అవుతోంది అని ఆయన చెప్పారు దీని వల్ల విశాఖ ఇంటర్నేషనల్ మ్యాప్ లో మరింతగా మెరుస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు. విశాఖ డైరెక్ట్ కనెక్షన్ విత్ గ్లోబ్ అని కూడా బాబు చెప్పుకొచ్చారు.
సరికొత్త టెక్ అధ్యాయం :
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. దాంతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు సంపాదించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా డేటా సెంటర్ విశాఖ నగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నగరాల సరసన చేరనుంది. గూగుల్ 1 గిగావాట్ సామర్ధ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న సబ్ సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ తో వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజితో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా అందుబాటులోకి రానుంది.
మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ గా :
విశాఖపట్నం తీర ప్రాంతం కావడంతో అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంతో అనుకూలం. తర్లువాడ, అడవి వరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌ను నిర్మించాలనేది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా సైంటిస్ట్ వంటి రంగాల్లో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో అనుబంధ రంగాల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్‌వర్కింగ్ వంటి రంగాల్లో స్థానికంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్లతో ఏఐ ఏకోసిస్టమ్ ఏర్పాటు కానుంది.