సంద‌డి మిస్స‌యిన కొత్త జిల్లాలు.. !

ఈ క్రమంలో వైసిపికి జిల్లాల విభజన.. అదేవిధంగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరును ఉమ్మడి కృష్ణా జిల్లాను విభజించి పెట్టినప్పటికీ లబ్ధి పొందలేని పరిస్థితి కనిపించింది.;

Update: 2026-04-27 23:30 GMT

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఒకటి మార్కాపురం. రెండు పోలవరం. ఏ ప్రభుత్వమైనా కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటుంది. అది వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. కానీ ఒక జిల్లాను విభజించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందడం అనేది పార్టీలు చేసే ఆలోచన. గతంలో వైసిపి 13 జిల్లాలను విభజించి 26 జిల్లాలుగా చేయడం ద్వారా రాజకీయంగా తమకు కలిసి వస్తుందని భావించింది.

కానీ, స్థానికంగా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోని నేపథ్యంలో వైసిపి ఈ రాజకీయ లబ్ధిని ఆశించిన విధంగా పొంద‌లేక పోయింది అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ప్రజలు కొన్ని ఆశలు పెట్టుకుంటారు. ఆకాంక్షలు కూడా ఉంటాయి. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పక్షానికి కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ విషయంలో వైసిపి విఫలమైంది. కొన్ని కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న స్థితి కనిపిస్తోంది.

ఈ క్రమంలో వైసిపికి జిల్లాల విభజన.. అదేవిధంగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరును ఉమ్మడి కృష్ణా జిల్లాను విభజించి పెట్టినప్పటికీ లబ్ధి పొందలేని పరిస్థితి కనిపించింది. అది అయిపోయిన ముచ్చట. మరి ఇప్పుడు రెండు జిల్లాలను విభజించడం ద్వారా రాష్ట్రంలో 26 గా ఉన్న జిల్లాలను 28 చేసిన కూటమి ప్రభుత్వానికి కొత్తగా ఏర్పాటు చేసిన ఈ రెండు జిల్లాల ద్వారా ఏ మేరకు లబ్ధి జరుగుతుంది అనేది చూస్తే పెద్దగా ఆశించిన ఫలితం వచ్చే అవకాశం కనిపించడం లేదు.

పోలవరం జిల్లాను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయలేదు. ప్రజల ఆకాంక్షల మేరకు పోలవరం జిల్లా కేంద్రాన్ని విస్తరించే క్రమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక మార్కాపురం జిల్లాలో కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. మార్కాపురంలో కూడా ప్రస్తుతం జిల్లా కేంద్రం లేకపోవడం.. జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయకపోవడం.. మౌలిక సదుపాయాల కల్ప‌న‌లో వెనక పడడం వంటివి ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయి.

సో ఈ విషయాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలి. రెండు ఉమ్మడి జిల్లాలను విభజించి ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ఎన్నికలకు ముందే ప్రజల మనసును చూర‌గొనే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే కొత్త జిల్లాల ఏర్పాటు లబ్ధి కూటమి ప్రభుత్వానికి లభిస్తుంది.

Tags:    

Similar News