పీకేకు షాక్... జగన్ చర్యలకు మాజీ జేడీ మద్దతు

Update: 2020-04-30 23:30 GMT
ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను విపక్షాలు విమర్శిస్తున్నా... మిగిలిన వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. కరోనా పేరు చెప్పి జనాన్ని భయపెట్టే కంటే వారిలో ధైర్యాన్ని నూరిపోయాలంటూ జగన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు కరోనా సాధారణ జ్వరమేనని, దాని గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అటు టీడీపీతో పాటు బీజేపీ ఏపీ శాఖ, జనసేనలు దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు షాకిస్తూ... ఆ పార్టీకి చెందిన కీలక నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ... జగన్ చర్యలను కొనియాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పవన్ కు నిజంగానే షాకిచ్చాయని చెప్పక తప్పదు.

అయినా జగన్ చర్యలను సమర్ధిస్తూ లక్ష్మీనారాయణ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘లాక్ డౌన్ సమయంలో మరిన్ని టెస్టులను చేయడం మంచిదే. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం, అక్కడ జరిపించిన పరీక్షలే. కరోనా పరీక్షలను చేయడంలో ఏపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిన్నగా ఉంది. లాక్ డౌన్ తో ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు కలిగింది. ప్రజారోగ్యంపై దృష్టిని సారించే సమయం లభించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, ఎన్ని ఎక్కువ టెస్ట్ లు చేస్తే అంత మంచిది. టెస్టులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కరోనా మృతుల్లో ఇతర సమస్యలున్న కారణంగా మరణించిన వారే అధికం. సాధ్యమైనంత వరకూ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలి’’ అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Read more!

మొత్తంగా వైరి వర్గానికి చెందిన నేత అయినా లక్ష్మీనారాయణ వాస్తవాలను ప్రస్తావించడంతో పాటుగా కరోనా కట్టడికి ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించడం ఆసక్తి రేకెత్తించే అంశమే. కరోనా విషయంలో నానాటికీ కేసులు పెరుగుతున్నాయని, వైసీపీ నేతల కారణంగానే ఈ తరహా పరిస్థితి నెలకొందని అటు టీడీపీతో పాటు ఇటు స్వయంగా పవన్ కూడా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో... అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన లక్ష్మీనారాయణ... పవన్ కు షాకిస్తూ జగన్ సర్కారు చర్యలను కీర్తిస్తూ వ్యాఖ్యలు చేయడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై పవన్ ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News